అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

అకాల వర్షాలు రైతన్నలను ఆగమాగం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.

Update: 2024-05-12 13:55 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : అకాల వర్షాలు రైతన్నలను ఆగమాగం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం నాగిరెడ్డిపేట్ మండల వ్యాప్తంగా ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు వేసిన ధాన్యం కుప్పలు వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. మండల కేంద్రంతో పాటు మండలంలోని పోచారం, చీనూర్, వాడి, మాల్ తుమ్మెద, నాగిరెడ్డిపేట్, గోపాల్ పేట్, ఆత్మకూరు, బొల్లారం, మెల్లకొండ తండా తదితర గ్రామాల్లో కురిసిన భారీ వర్షానికి వరి ధాన్యం రాసులు పూర్తిగా తడిశాయి. వరి ధాన్యం కుప్పలపై రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి ఉంచినప్పటికీ గంట పాటు కురిసిన భారీ వర్షానికి వరి

    ధాన్యపు కుప్పల చుట్టూ నీరు చేరి వరి ధాన్యం పూర్తిగా తడిసింది. అంతేకాకుండా తూకం వేసిన వరి ధాన్యం బస్తాలు సైతం భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. అకాల భారీ వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం నెల రోజులు గడుస్తున్నా కొనుగోళ్లలో జాప్యం జరుగుతూ ఉండడమే కాకుండా అకాల వర్షాలతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తడిసిన వరిధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 


Similar News