నీటిపారుదల ప్రాజెక్టుల పై బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్దాలే..పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి..
రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు అందిస్తున్నామని చెబుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలన్నీ నీటి మూటలే అని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రైతులకు సాగునీరు అందుతుందంటే కారణం అది గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లనేనని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయానికి సాగునీరు అందిస్తున్నామని చెబుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలన్నీ నీటి మూటలే అని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రైతులకు సాగునీరు అందుతుందంటే కారణం అది గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టిన ప్రాజెక్టుల వల్లనేనని మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల కమిషన్లు దండుకోవడం తప్ప రైతులకు సాగు నీరు అందించే ఉద్దేశం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు ప్రజలకు సాగు, తాగునీరు అందిస్తున్న భారీ, మధ్య తరహా, చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ కూడా గత ప్రభుత్వాలు నిర్మించినవే తప్ప బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు ఒకటి కూడా లేదని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో నిర్మించిన కోస్లి లిఫ్ట్ ఇరిగేషన్, ఎర్రకుంట చెరువుతో పాటు అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ను సందర్శించిరు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగం పై ఆధారపడ్డ నిజామాబాద్ జిల్లాను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో తాను మంత్రిగా ఉన్నప్పుడు కోస్లి లిఫ్ట్ ఇరిగేషన్, ఎర్రకుంట చెరువుతో పాటు అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారన్నారు. ప్రస్తుతం వీటి ద్వారానే ఉమ్మడి జిల్లాలోని పంట పొలాలకు సాగునీరు అందుతుందని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించి రైతుల సమస్యల పరిష్కారం కోసం గాని తాగునీరు, సాగునీరు సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం మానేసి ఇప్పటిదాకా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తమ ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు నిజామాబాద్ అర్బన్ ఇంచార్జ్ తహేర్ బీన్ హందాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి , కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముప్పగంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.