చెరువులో నీరున్నా ఎండుతున్న పంటలు

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రానికి సమీపంలో గల నల్లచెరువు ఆయకట్టు రైతులు కంటతడి పెడుతున్నారు.

Update: 2024-03-09 14:46 GMT

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రానికి సమీపంలో గల నల్లచెరువు ఆయకట్టు రైతులు కంటతడి పెడుతున్నారు. చెరువులో నెల రోజులకు సరిపడా నీరు ఉన్నప్పటికీ, భూములకు సాగు నీరు అందించే చెరువు కట్ట తూము శిథిలమై, తూములో పూడికచేరి నీరు బయటకు రాక ఆ తూము కింద ఉన్న ఆయకట్టు ప్రస్తుతం ఎండిపోయే దశకు చేరుకుంది. ఇప్పటికే పొలాలన్నీ నెర్రెలు బారి, వరి పంట పొట్ట దశలో ఉండి, నీరు అందక ఎండడానికి సిద్ధంగా ఉండడంతో అన్నదాతలు కంట నీరు పెడుతున్నారు.

    శిథిలమైన తూము నుంచి నీటిని బయటకు తీసుకురావడానికి అన్నదాతలు ఎంతగా కష్టపడుతున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. సాగునీటి పారుదల శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం రైతులకు శాపంగా మారింది. కోట్లాది రూపాయలు వెచ్చించి మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులు బాగు చేశామని గొప్పగా చెప్పుకుంటున్న పాలకులు, అధికారులు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదంటూ రైతులు ఆరోపిస్తున్నారు. మరో వారం రోజులు నీరు అందకుంటే నల్లచెరువు తూము ఆయకట్టు కింద ఉన్న 600 ఎకరాల వరి పంట చేతికి రాకుండా పోతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించి వెంటనే తూము బాగు చేయించి ఎండుతున్న పంటలకు సాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Similar News