ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ రగడ

వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టు తయారైంది కామారెడ్డిలో అధికారుల తీరు.

Update: 2024-03-09 12:38 GMT

దిశ, కామారెడ్డి : వెంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టు తయారైంది కామారెడ్డిలో అధికారుల తీరు. ఒకవైపు ఎమ్మెల్యే.. మరోవైపు అధికార పార్టీకి చెందిన ప్రభుత్వ సలహాదారు. ఈ ఇద్దరి మధ్య అధికారుల పరిస్థితి కక్కలేక మింగలేని చందంగా తయారైంది. జిల్లా ఆస్పత్రిలో 4.53 కోట్లతో నూతనంగా నిర్మించిన100 పడకల గదులు, వార్డుల ప్రారంభోత్సవం కార్యక్రమం ప్రొటోకాల్ వివాదానికి దారి తీసింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభోత్సవం ఉండగా ఉదయం 11 గంటలకే ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి జిల్లా ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖికి వెళ్లారు. దాదాపు రెండున్నర గంటల పాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో కూర్చుని పలు అంశాలపై వివరాలు సేకరించారు. ఆస్పత్రి బయట క్యాంటీన్ ఏర్పాటు, సులభ్​ కాంప్లెక్స్ నిర్మాణం, ఆరోగ్యశ్రీ నిధుల విషయాలపై ఆరాతీశారు.

    ఆస్పత్రి బయట ఏర్పాటు చేసిన కిరాణా షాపు, క్యాంటీన్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగిందని సదరు క్యాంటీన్ నిర్వాహకుడు చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కూడా ఎవరికి పడితే వారికి పెట్టుకొమ్మని చెప్తానని, చేస్తారా అని ప్రశ్నించారు. ఆస్పత్రి వెనకాల ఏర్పాటు చేసిన సులభ్​ కాంప్లెక్స్ కాంట్రాక్టర్ ను పిలిపించారు. ఆస్పత్రిలో సులభ్​ కాంప్లెక్స్ కాంట్రాక్టు ఎలా ఇస్తారని సూపరింటెండెంట్ ను ప్రశ్నించగా కలెక్టర్ ఆదేశాల మేరకు చేశామని చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సులభ్​కాంప్లెక్స్ ఏర్పాటుకు ఎంత ఖర్చయిందని కాంట్రాక్టర్ ను ప్రశ్నించారు. రూ.30 లక్షల వరకు అయిందని సదరు కాంట్రాక్టర్ చెప్పడంతో తాను కూడా కాంట్రాక్టర్ గా పని చేశానని, ఇష్టం వచ్చినట్టుగా చెప్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సులభ్​ కాంప్లెక్స్ ఏర్పాటుకు సంబంధించి ఆసుపత్రి పత్రాలు, ఖర్చుల వివరాలు ఇవ్వాలని సూచించగా తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తి తిరిగి రాలేదు. ఆరోగ్యశ్రీ ద్వారా మొత్తం ఎంతమందికి చికిత్స అందించారు. ఏ వైద్యునికి ఎంతమేర నిధులు చెల్లించారో చెప్పాలని సూపరింటెండెంట్ ను కోరారు.

     అనంతరం ప్రొటోకాల్ అంశాన్ని లేవనెత్తారు. 100 పడకల గదుల ప్రారంభోత్సవానికి మంత్రి వస్తే ఎమ్మెల్యేకు చెప్పాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు. తనకు ఆహ్వానం ఉండదా అని ప్రశ్నించారు. కామారెడ్డి నుంచి పారిపోయి ఓడిపోయిన వ్యక్తితో (షబ్బీర్ అలీ) ప్రారంభోత్సవం చేయిస్తారా అని నిలదీశారు. ఇప్పుడు తన స్థానం ఏంటో, తానెవరినో చెప్పాలన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏ ప్రొటోకాల్ ప్రకారం మహమ్మద్ షబ్బీర్ అలీని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలికారని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు పేరు శిలాఫలకం పై ఏ జీఓ ప్రకారం పెట్టారు కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభోత్సవానికి జిల్లాలోని మిగితా ఎమ్మెల్యేలకు ఎందుకు ఆహ్వానం పలకలేదన్నారు. ఒక్క షబ్బీర్ అలీకి మాత్రమే ప్రొటోకాల్ ఉంటుందా మిగిలిన ఇద్దరికి కూడా ఉంటుందా లేదా చెప్పాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అధికారిక కార్యక్రమాల్లో షబ్బీర్ అలీ పాల్గొనలేదని, ఎల్లారెడ్డి, జుక్కల్, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నా అక్కడా ఆయనకు ప్రొటోకాల్ గుర్తుకు రాలేదని, ఒక్క కామారెడ్డిలోనే ఎందుకని ప్రశ్నించారు.

    కలెక్టర్ ను అడిగితే సరైన సమాధానం చెప్పలేదన్నారు. కలెక్టర్ కు జీవోలను చదివి వినిపించానని తెలిపారు. ప్రొటోకాల్ వివాదం వస్తుందని అప్పటికప్పుడు మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రారంభోత్సవం చేయించాలని చూశారని, అదికూడా రద్దయిందన్నారు. తాను ఇద్దరు సీఎం అభ్యర్థులపై గెలిచానని, ఆషామాషీ కాదన్నారు. రాత్రి 10 గంటలకు అడిషనల్ కలెక్టర్ ఫోన్ చేసి మంత్రి జూపల్లి వస్తున్నారని చెప్పారని, రూల్ ప్రకారం ఎవ్వరొచ్చినా తాను వస్తానని చెప్పానని, ప్రొటోకాల్ తప్పితే మాత్రం ఊరుకునేది లేదని చెప్పానన్నారు. రాత్రి 12 గంటలకు మంత్రి జూపల్లి, ఆయన ఓఎస్డి ఫోన్ చేస్తే మాట్లాడి విషయం చెప్పానన్నారు. మళ్లీ ఉదయం మంత్రి ఫోన్ చేస్తే ఆయన కూడా జీఓ 116 ప్రకారం చెప్పారని తెలిపారు. తాను ప్రారంభోత్సవానికి రావడం లేదని, మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోవాలని చూస్తే కుదరదని చెప్పానన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీఎం వచ్చినా తనకు ఆహ్వానం లేకపోయినా చివరాఖరులో నిలబడతానన్నారు.

    రూల్ పొజిషన్ మంత్రికి చెప్తే జీఏడీకి రాస్తానని చెప్పారని, రెండవ శనివారం, ఆదివారం కావడంతో నాలుగు రోజుల తర్వాత అక్కడి నుంచి సమాధానం వస్తుందని, ఆలోపు ఇక్కడ ప్రారంభోత్సవం అయిపోతే తాను చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఇక ఆస్పత్రి విషయంలో ఇష్టానుసారం సులభ్​ కాంప్లెక్సుల నిర్మాణానికి అనుమతులు ఇస్తారని, డబ్బులు ఇచ్చి ఆస్పత్రిలో వారికి ఉపయోగపడకున్నా బయటవాళ్ళు వచ్చి వాడుకుంటారన్నారు. ఆరోగ్యశ్రీ నిధుల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ట్రామాకేర్ డబ్బులను ప్రమాదం జరిగిన వారికి వాడకుండా వడ్డీలకు ఇస్తున్నారన్నారు. రూల్, ప్రొసీజర్, గైడ్ లైన్స్ అడిగితే చూపెట్టడం లేదన్నారు. ఇలాంటి ఆస్పత్రికి ప్రభుత్వ సలహాదారు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారని ఎద్దేవా చేశారు.

    రాష్ట్రంలో సీఎం ఏ కార్యక్రమానికి వెళ్లినా ఆహ్వానం ఉండదు కానీ సీఎం రేవంత్ రెడ్డి షబ్బీర్ అలీకి కామారెడ్డి రాసిచ్చారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వక తప్పు చేశారని, ఓటుకు నోటు కేసులో కేసీఆర్ రేవంత్ రెడ్డిని జైలుకు పంపి తప్పు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం తనను అనవసరంగా గెలికి తప్పు చేస్తుందన్నారు. రాబోయే కాలంలో ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు. కామారెడ్డిలో పని చేయడానికి అధికారులు డబ్బులిచ్చి పోస్టింగ్స్ తీసుకుంటున్నారని ఆరోపించారు.

     సివిల్ సప్లై జీఎం ఒకరు 15 లక్షలిచ్చి వస్తున్నారని, ముగ్గురు పోలీస్ అధికారులు డబ్బులిచ్చి వచ్చారన్నారు. ఆర్ అండ్ బీ ఎస్ఈ డబ్బులిచ్చి నిజామాబాద్ వెళ్లారన్నారు. కామారెడ్డిలో డబ్బుల కలెక్షన్ చేస్తే ఒక్కొక్కరి వీపులు పగిలిపోతాయని వార్నింగ్ ఇచ్చారు. విలేకరులతో మాట్లాడిన అనంతరం ఆస్పత్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ రిక్వెస్ట్ చేసినా తాను రాలేనని చెప్పి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఉన్న బయట వ్యక్తులందరినీ బయటకు పంపించేశారు.

100 పడకల గదులను ప్రారంభించిన షబ్బీర్ అలీ

ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో పోలీసులు వారందరినీ ఆస్పత్రి గేటు వద్దే అడ్డుకున్నారు. షబ్బీర్ అలీతో పాటు మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్య నాయకులకు మాత్రమే ఆస్పత్రి లోపలికి అనుమతించారు. ఆస్పత్రి పై భాగంలో 4.53 కోట్లతో నిర్మించిన 100 పడకల గదులు, ఇతర వార్డులను కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో కలిసి ప్రారంభించారు.

     ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రారభోత్సవానికి మంత్రి జూపల్లి కృష్ణారావు రావాల్సి ఉన్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారన్నారు. జిల్లా ఆస్పత్రి 30 పడకలుగా ఉన్నప్పుడు తన హయాంలో 100 పడకలకు పెంచామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అన్ని వసతులు అందుబాటులోకి వచ్చాయని, వైద్యులు, వైద్య సిబ్బంది బాగా పని చేసి ఆస్పత్రికి మంచిపేరు తేవాలన్నారు.

    కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ప్రాణహిత చేవెళ్ల పనుల పూర్తికి కావాల్సిన 200 కోట్ల నిధులను కేటాయించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్టు చెప్పారు. మెడికల్ ఆస్పత్రి, దోమకొండ 100 పడకల ఆస్పత్రుల నిర్మాణం పూర్తి కాగానే కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుందన్నారు. త్వరలోనే జిల్లా ఆస్పత్రికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను తీసుకువస్తానని పేర్కొన్నారు.


Similar News