విద్యాబోధననేతో తలరాత మారుతుంది

విద్య బోధనతో విద్యార్థినీ, విద్యార్థులు తమ తలరాతను మార్చుకోవచ్చని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు.

Update: 2024-09-05 13:09 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : విద్య బోధనతో విద్యార్థినీ, విద్యార్థులు తమ తలరాతను మార్చుకోవచ్చని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ అన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు విద్యార్థి భవిష్యత్తును తీర్చిదిద్ది జీవితాన్నిస్తాడని అధికారి అన్నారు. నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవి కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి ఉపాధ్యాయ, అధ్యాపకులని గౌరవించాలన్నారు. నిరుపేద విద్యార్థినీ, విద్యార్థులు అధ్యాపకుల బోధనను శ్రద్ధతో విని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు.

    దేశంలోనే అత్యున్నత పదవిని అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఉపాధ్యాయ వృత్తి ద్వారా రాష్ట్రపతి పదవి దాకా ఎదిగారని అన్నారు. ప్రస్తుత తరుణంలో అధ్యాపకులు భావిభారత పౌరులైన విద్యార్థులకు బంగారు భవిష్యత్తును చూపించాలని అధ్యాపకులను ఉద్దేశించి అన్నారు. విద్యార్థులు శ్రద్ధతో ప్రతిరోజూ కళాశాలకు హాజరై తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని సూచించారు. విద్య నేర్చుకోవడానికి కులము, మతము, పేద, ధనిక తారతమ్యాలు అవసరం లేదన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యసాధన దిశగా శ్రద్ధతో విద్యను అభ్యసించాలని సూచించారు. బాలికల కళాశాలలో ప్రతి అధ్యాపకుడు శక్తి వంచన లేకుండా తమ విధులు నిర్వర్తిస్తూ విద్యార్థినులను తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని అభినందించారు.

    కళాశాల ప్రిన్సిపాల్ బుద్దిరాజ్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థినిపై వ్యక్తిగత శ్రద్ధతో పనిచేస్తూ భావిభారత పౌరులను తీర్చిదిద్దడానికి కృషి చేయాలని అన్నారు. అధ్యాపక వృత్తి మహోత్కృష్టమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. వైద్యుడు, ఇంజనీర్, న్యాయవాది, ఇతర ఏ వృత్తి అయినా ఒక గురువు వద్దనే విద్యను అభ్యసించాల్సి ఉంటుందన్నారు. ఉపాధ్యాయ వృత్తిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని పేర్కొన్నారు. విద్యార్థులలోని జ్ఞానాన్ని వెలికి తీసి వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులేనని రవికుమార్ అన్నారు. స్వయంపాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థినులు గురువారం అధ్యాపకులుగా అవతారమెత్తి విద్యను బోధించారు. ఒకరోజు అధ్యాపకులుగా పనిచేసిన విద్యార్థులకు ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవి కుమార్, ప్రిన్సిపాల్ బుద్దిరాజు, అధ్యాపకులు సర్టిఫికెట్లను అందజేశారు. 

Tags:    

Similar News