నల్ల చెరువు కింది పంట... గుంట కూడా ఎండనివ్వను : ఎమ్మెల్యే పోచారం

కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రం పరిధిలోని నల్ల చెరువు కింద వరి పంటను గుంట కూడా ఎండనివ్వనని మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

Update: 2024-03-11 13:43 GMT

దిశ, బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రం పరిధిలోని నల్ల చెరువు కింద వరి పంటను గుంట కూడా ఎండనివ్వనని మాజీ శాసనసభ సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. చెరువు నుంచి నీళ్లు పొలాలకు రాకుండా తూములో చెత్త అడ్డంగా ఇరుక్కుని పొలాలకు నీరందడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా సోమవారం స్వయంగా నల్ల చెరువు తూమును పరిశీలించారు.

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో ఈ యాసంగిలో అలీసాగర్ వరకు 1.30 లక్షల ఎకరాలలో సాగునీరు అందించడానికి ప్రణాళిక తయారు చేశామని, ఏడు విడతలుగా సాగునీరు అందిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆరో విడత నీటి విడుదల కొనసాగుతుందని, ప్రతి ఎకరాకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బీర్కూరు నల్ల చెరువు కింద 650 ఎకరాల ఆయకట్టు ఉన్నదని, చెరువు తూములో ఏదో ఇరుక్కోవడంతో నీళ్ళు బయటకు రావడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు తనకు సమాచారం ఇచ్చారన్నారు.

పరిస్థితిని పరిశీలించడానికి స్వయంగా వచ్చానని, సాగునీటి శాఖ అధికారులను పిలిపించి మాట్లాడారు. నీటి అడుగున చెత్త, ఇతర అడ్డంకులను శుభ్రం చేయడంలో నిపుణులను పిలిపించి మంగళవారం సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారని, నిపుణులతో పరిష్కారం కాకపోతే తూముకు అడ్డంగా చెరువులో మట్టి కట్ట వేసి తూమును పూర్తిగా శుభ్రం చేయిస్తామన్నారు. ఎకరం కూడా ఎండిపోకుండా పంటలను కాపాడుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రఘు, ఎంపీటీసీ సందీప్ పటేల్, కో అప్షన్ ఆరిఫ్, ఇరిగేషన్ డీ ఈ జగదీశ్, తహసీల్దార్ శ్రీలత, ఎంపీడీఓ భారతి,నాయకులు అవారి గంగారాం, పోగు నారాయణ, కోరిమె రఘు, బుడ్డ రాజు, మన్నాన్, లాయక్, లాడేగాం గంగాధర్, ఇంగు రాములు ఆయకట్టు రైతులు ఉన్నారు.


Similar News