విద్యాశాఖలో బదిలీల కోలాహలం.. ఉమ్మడి జిల్లాలో 2వేల మంది ఉపాధ్యాయుల బదిలీ?

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Update: 2024-06-09 02:42 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2023లో అక్టోబర్ లో జరిగిన బదిలీల్లో రిలీవ్ కానీ ఉపాధ్యాయులు శనివారం రిలీవ్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో 1,600మంది ఉపాధ్యాయులకు బదిలీ కాగా వారందరూ రిలీవ్ కావడంతో వారికి రేపోమాపో పోస్టింగ్ లు ఇవ్వనున్నారు. ఎన్నికల కోడ్ ప్రక్రియ నిలిచిన వెంటనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ చేపడుతామని ప్రభుత్వం శుక్రవారం షెడ్యూల్ ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్లు, పండితులు, పీఈటీలు గత ప్రభుత్వ హయంలో వారికి న్యాయం జరుగలేదు. పదేళ్ళుగా వారికి నిరుత్సాహం మిగిలిపోయింది.గత సంవత్సరం గెజిటెడ్ హెడ్ మాస్టర్ పదోన్నతుల ప్రక్రియ చేపట్టిన ప్రభుత్వం ఎస్జీటీ లాంగ్వేజ్ పండితులు, పీఈటీలకు మాత్రం న్యాయం చేయకపోవడంతో అర్హత ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న హోదా లోనే చాలా మంది పదవి విరమణ చేశారు. బదిలీ ప్రక్రియ గతేడాది చేపట్టినప్పటికీ వారు పని చేస్తున్న చోట అక్కడే విధులు నిర్వహించారు.

ప్రభుత్వం బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది. బదిలీలు, పదోన్నతుల కోసం అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 10, 11వ తేదిల్లో జిల్లా విద్యాశాఖాధికారికి దరఖాస్తు చేసుకోగా వాటిని పరిశీలిస్తారు. 12, 13 తేదిల్లో బదిలీలు, పదోన్నతుల సీనియర్ జాబితాను ప్రకటిస్తారు. అభ్యంతరాలు ఉంటే ఆధారాలతో సహా తెలియపర్చుకునేందుకు ఈ నెల 14, 15వ తేదిల్లో డిఈవోలు పరిశీలించి విద్యాశాఖ వెబ్ సైట్ లో పొందుపరుస్తారు. 16 నుంచి 20 వరకు ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించే ప్రక్రియను చేపడుతారు. 21 నుంచి 24 వరకు ఎస్జీటీల బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత జరుగుతున్న పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది జరిగిన బదిలీల్లో 1074 మందికి స్థాన చలనం కలుగగా వారందరూ రిలీవ్ అయ్యారు. నిజామాబాద్ జిల్లాలో 450 స్కూల్ అసిస్టెంట్ లకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా చేసే పదోన్నతుల ప్రక్రియలో 87 శాతం మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయని చెప్పవచ్చు. 400 నుంచి 450 మంది ఎస్జీటీలు ఎల్ఎఫ్ ఎల్ హెచ్ ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 వేల మంది ఎస్జీటీలకు బదిలీలు జరిగే అవకాశం ఉంది.

ఎస్జీటీలకు పదోన్నతులలో తీవ్ర నష్టం, చోద్యం చూస్తున్న మల్టీ క్యాడర్ సంఘాలు

ఎస్జీటీలకు భారీ పదోన్నతులని అసత్య ప్రచారం చేస్తూ 10,000 ప్రైమరీ స్కూల్ పోస్టులను గాను కేవలం 2130 పోస్ట్ లు చూపడం వీటికి కేవలం టీటీసీ చేసిన ఎస్జీటీలు మాత్రమే అర్హులు. అదే మాదిరిగా 10,479 భాషా పండిత, పీఈటీ పోస్టులను జీవో 11 , 12 కు వ్యతిరేకంగా గత ప్రభుత్వం దారి చేసిన జీవో 2 , 3 అలాగే 9,10 ప్రకారం అర్హతగల ఎస్జిటీలను కాదని ఏకపక్షంగా భాషా పండిత పీఈటీలకు కట్టబెట్టాలని చూడటం. ఇక మిగిలిన ఎస్ఏ 5123 పోస్టులు ( మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లిష్) ఈ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో బీఈడీ చేసిన ఎస్జీటీలు, భాషా పండితులు, పిఈటిలు అర్హులు మరి ఈరకంగా చూస్తే ఎవరికి పదోన్నతులలో ఎక్కువ మొత్తం లబ్ది చేకూరుతుంది. ఎస్జీటీలలో డీఎస్సీ 2000 వారికి కూడా పదోన్నతులు రావు అదే భాషా పండితులు, పీఈటీలు డీఎస్సీ 2017 వరకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందుతారు. ఇది ఎక్కడ న్యాయమో మల్టీ క్యాడర్ సంఘాలు సమాధానం చెప్పాలి. ఈ రకంగా చూస్తే రాబోయే రోజులలో ఎస్జీటీలు గానే పదవి విరమణ పొందుతారు. ఇకనైనా ఎస్జీటీలు మేల్కొని ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం కాకపోతే నష్టపోతామని ఉపాధ్యాయ సంఘాల్లో చర్చ జరుగుతుంది.


Similar News