ఉమ్మెడ గోదావరిలో యువకుడి అనుమానస్పద మృతి కాదు.. మర్డరే

ఈ నెల 6న దిశ దినపత్రికలో రెండు నెలలైనా కొలిక్కి రాని యువకుడి అనుమానస్పద మృతి కేసు పేరుతో వచ్చిన కథనం పోలీసు యంత్రాంగాన్ని కదిలించింది.

Update: 2023-02-08 15:51 GMT

దిశ, నందిపేట్ : ఈ నెల 6న దిశ దినపత్రికలో రెండు నెలలైనా కొలిక్కి రాని యువకుడి అనుమానస్పద మృతి కేసు పేరుతో వచ్చిన కథనం పోలీసు యంత్రాంగాన్ని కదిలించింది. డిసెంబర్ 3న గోదావరి నదిలో శవమై తేలిన యువకుడిది అనుమానస్పద మృతి కాదని మర్డర్ అని పోలీసులు తేల్చారు. స్నేహితుడి నుంచి అవసరాల కోసం తీసుకున్న రూ.2 లక్షల డబ్బును తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు అతని దోస్తే అతన్ని గోదావరినదిలో తోసేసి హత్య చేశాడని ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ తెలిపారు.

బుధవారం నందిపేట్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ తెలిపిన కథనం ప్రకారం గతేడాది నవంబర్ 30న ఉమ్మెడ గ్రామానికి చెందిన ఏర్గట్ల శ్రీకాంత్ (25) ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతని అన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. నందిపేట్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. డిసెంబర్ 3న నందిపేట్ మండలం ఉమ్మెడలోని గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్గట్ల శ్రీకాంత్ డెడ్ బాడి లభించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. అయితే రెండు నెలలయిన కేసు కొలిక్కి రాకపోవడానికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక రాకపోవడమని పోలీసులు తెలిపారు. అయితే బుధవారం ఉమ్మెడ గ్రామానికి చెందిన ఏర్గట్ల శ్రీకాంత్ స్నేహితుడు అయిన నాగం భోజేంధర్ ఆలియాస్ చింటును పట్టుకుని విచారించగా ఈ కేసు కొలిక్కి వచ్చింది.

ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన శ్రీకాంత్ తన స్నేహితుడు నాగం భోజేంధర్ అవసరాల కొరకు రూ.2 లక్షల ఎవరికి తెలియకుండా పంపించాడు. దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన శ్రీకాంత్ తన డబ్బులు ఇవ్వాలని భోజేంధర్ ను పదే పదే డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చాడు. శ్రీకాంత్ ను హతమారిస్తే డబ్బులు ఇచ్చే అవసరం ఉండదని భోజేందర్ పథకం ప్రకారం శ్రీకాంత్ ను ఉమ్మెడ బ్రిడ్జి వద్దకు పిలిచి బ్రిడ్జిపై కూర్చున్న అతన్ని నదిలో తోసేసి ఏమి తెలియనట్లు పరారీ అయ్యాడు. అందరూ శ్రీకాంత్ ది ఆత్మహత్య అని నమ్ముతారని ఈ పథకాన్ని అమలుచేసి పారిపోయానని బోజేంధర్ పోలీసుల విచారణలో తెలిపారు. ఈ మేరకు బోజేందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసు ఛేదనకు ఆర్మూర్ రూరల్ ఇన్స్ పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, నందిపేట్ ఎస్సై శ్రీకాంత్, వారి టీం కష్టపడి పట్టుకుందని ఏసీపీ తెలిపారు.

Tags:    

Similar News