ఆర్మూర్ మున్సిపల్ ఇన్ చార్జి చైర్మన్ గా షేక్ మున్న బాధ్యతల స్వీకరణ

ఆర్మూర్ మున్సిపల్ ఇన్ చార్జీ చైర్మన్ గా వైస్ చైర్మన్ షేక్ మున్న మంగళవారం బాధ్యతలను స్వీకరించారు.

Update: 2024-03-12 12:52 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ ఇన్ చార్జీ చైర్మన్ గా వైస్ చైర్మన్ షేక్ మున్న మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలోని చైర్మన్ ఛాంబర్ లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా కాంగ్రెస్ నాయకుల కోలాహలం మధ్య జరిగింది. ఈ ఏడాది జనవరి 4న మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై బీఆర్ఎస్ పార్టీకి చెందిన సొంత కౌన్సిలర్ లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాసం నెగ్గిందా, వీగిందా అనే అంశంపై అనేక రోజులు ఉత్కంఠను రేకెత్తించగా చివరికి హైకోర్టు ఆదేశాల మేరకు అవిశ్వాసం నెగ్గిందని తీర్పురావడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్నకు ఇన్చార్జి చైర్మన్ గా బాధ్యతలు అప్పగించేందుకు మార్గం సుగమమైంది.

    దీంతో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్నకు ఆర్మూర్ మున్సిపల్ ఇంచార్జి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి చైర్మన్ మున్న మాట్లాడుతూ.. ఆర్మూర్ మున్సిపల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తన నియామకానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన షేక్ మున్నకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి పుష్పగుచ్చమిచ్చి శాలువాతో సన్మానించారు. కౌన్సిలర్లు ఇన్చార్జి చైర్మన్ ను కలిసి మిఠాయిలు తినిపించి, అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, కాంగ్రెస్ నాయకులు అయ్యప్ప శ్రీనివాస్ , కాందేష్ శ్రీనివాస్ , కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News