పటాకుల స్టాళ్లకు రూ.2500 వసూల్..?

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని విక్రయించే పటాకుల స్టాళ్లను జనసంచారం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.

Update: 2022-10-23 10:42 GMT

దిశ, భిక్కనూరు : దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని విక్రయించే పటాకుల స్టాళ్లను జనసంచారం లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి. దానికి కూడా పోలీసులు, అగ్నిమాపక శాఖ నుంచి పర్మిషన్లు తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో షాపులను జనసంచారంలోనే ఏర్పాటు చేస్తున్నారు. దానికి అగ్నిమాపక శాఖ, పోలీసులు శాఖ అధికారులు కూడా పర్మిషన్లను ఇస్తున్నారు. అయితే ఎవరైతే స్టాల్ పెట్టుకుంటున్నారో వారి నుంచి రెండు శాఖల అధికారులు రూ.2500 చొప్పున డబ్బులు వసూలు చేయడం చర్చనీయాంశంగా మారింది. నేరుగా అధికారులు వసూళ్లకు పాల్పడకుండా కొందరు మధ్యవర్తుల ద్వారా ఈ తతంగం నడుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మండల కేంద్రమైన భిక్కనూరులో గాంధీచౌక్, సినిమా టాకీస్ చౌరస్తా, అంగడి బజార్ ల వద్ద తమ తమ దుకాణాల ముందు టపాసుల ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసుకొని ప్రతియేటా విక్రయిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కొత్తగా అగ్నిమాపకశాఖ, కొందరు పోలీస్ శాఖ సిబ్బంది స్టాల్ కు రూ.2500 చొప్పున వసూలు చేయడమే కాకుండా, తీరొక్క పటాకులను పొట్లంకట్టి వారికి అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే స్టాలు లేకుండా చేయడమే కాకుండా, పటాకులు ఎట్లా అమ్ముతారో చూస్తా మంటూ బెదిరిస్తున్నారని సమాచారం. దీంతో షాపు యజమానులు కొందరు చేసేదేమీలేక భయపడిపోయి వారు అడిగినంత ముట్ట జెప్తున్నారు. అంతేకాదు ఆయాశాఖల అధికారులకు కావాల్సిన పటాకులన్ని పొట్లం కట్టి రహస్యంగా మధ్యవర్తి ద్వారా అందజేస్తున్నారు. కొంత మంది విక్రయదారులు డబ్బును పటాకుల అమ్మకాలు ముగిశాక చెల్లిస్తామని చెప్తున్నారు.

Tags:    

Similar News