ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్

ప్రజావాణి ద్వారా స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు.

Update: 2024-03-11 11:42 GMT

దిశ, కామారెడ్డి, క్రైమ్ : ప్రజావాణి ద్వారా స్వీకరించిన అర్జీలను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి 48 అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా ఇందులో భూ సమస్యలకు సంబంధించి 24 వినతులు రాగా, రెండు పడకల ఇల్లు కావాలని 6, ఉపాధి కల్పనకై 5 వినతులు వచ్చాయి.

అదేవిధంగా పంచాయతీరాజ్, మున్సిపల్, ఆర్ అండ్ బి, విద్యుత్,పోలీసు శాఖకు సంబంధించిన వచ్చిన వినతులను ఆయా శాఖాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలని, తద్వారా దరఖాస్తుదారులకు సత్వర మేలు చేకూరే అవకాశముందని అన్నారు. ముఖ్యంగా నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాల్సిన ఆర్జీలకు ప్రాధాన్యతని ఇచ్చి వాటి పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

జిల్లా స్థాయితో పాటు క్రింది స్థాయి అధికారులు సైతం ఫిర్యాదుల పరిష్కారంలో చొరవ చూపాలన్నారు. . కొన్ని ఫిర్యాదులను స్వయంగా పరిశీలిస్తూ సంబందిత అధికారులను తన దగ్గరకు పిలిపించుకొని వాటి పరిష్కారానికి మార్గాలు సూచిస్తూ చర్యలు తీసుకోవలసిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ పిడి చందర్ నాయక్, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి బావయ్య, కలెక్టరేట్ ఏ.ఓ. మసూర్ అహ్మద్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Similar News