'తల్లిదండ్రులు మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు..'

కని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కుమారులు, కూతుళ్లు సరిగా చూడనట్లయితే కోర్టులలో తల్లిదండ్రులు మెయింటెనెన్స్ కేసు వేయవచ్చని ఆర్మూర్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి నసీమా సుల్తానా చెప్పారు.

Update: 2025-03-22 15:52 GMT
తల్లిదండ్రులు మెయింటెనెన్స్ కేసు వేయవచ్చు..
  • whatsapp icon

దిశ, ఆర్మూర్ : కని, పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కుమారులు, కూతుళ్లు సరిగా చూడనట్లయితే కోర్టులలో తల్లిదండ్రులు మెయింటెనెన్స్ కేసు వేయవచ్చని ఆర్మూర్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి నసీమా సుల్తానా చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూర్ మండలం మిర్ధాపల్లి గ్రామంలోని గురడిరెడ్డి సంఘంలో శనివారం మండల లీగల్ సర్వీస్ కమిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా సంయుక్త ఆధ్వర్యంలో లీగల్ అవేర్నెస్ సదస్సును నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొని ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులను కుమారులు, కూతుళ్లు బాగా చూసుకోవాలన్నారు. కోడళ్ళు అత్తమామలను బాగా చూసినట్లయితే భవిష్యత్తులో వారి కుమారులు కోడళ్ళు చక్కగా చూసుకుంటారని చెప్పారు. నేటి రోజుల్లో గ్రామాల్లో సైతం తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో పెట్టడం బాధాకరమన్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకొని పేరు సంపాదించాలన్నారు.

వరకట్నం, మెయింటెనెన్స్, గృహహింస, విడాకుల పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని సూచించారు. విదేశాల్లో చదువుకొని, నివసిస్తున్న పిల్లలు వివాహమైన కొన్ని నెలల్లోనే విడాకులు తీసుకుంటున్నారన్నారు. విడాకులు ఎందుకు తీసుకుంటున్నారన్న అంశం పై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆలోచించి పెళ్లి, కుటుంబం ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. చిన్న చిన్న తగాదాలతో ఆస్తుల కోసం అన్నదమ్ములు ఘర్షణ పడుతున్నారన్నారు. మనిషి జీవించే కొన్ని సంవత్సరాలు సంబంధాలను తెంపుకొని జీవించి ఏం సాధిస్తారని ఆమె ప్రశ్నించారు. మిర్ధాపల్లిలో కొందరు రైతులు రుణాలు చెల్లించకుండా బ్యాంకుకు బకాయిదారులుగా ఉన్నట్లు తెలిసిందన్నారు. బకాయి ఉన్నవారు బ్యాంకుకు డబ్బులు చెల్లించి తిరిగి రుణాలు పొందాలని కోరారు. ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ చట్టాల పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన లీగల్ సెల్ అథారిటీని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తల్లిదండ్రులు, ఆస్తులను పొందాలనుకునే వారు లీగల్ సెల్ ను ఆశ్రయించ వచ్చన్నారు. గ్రామస్తులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యాంకుల వద్ద డబ్బులను డ్రా చేసేటప్పుడు ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, అతివేగంతో ప్రయాణించడం ప్రమాదకరమన్నారు. చిన్నపిల్లలు, మైనర్ బాల బాలికలు సెల్ ఫోన్లు వాడేటప్పుడు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. ఈ సదస్సులో నిజాంసాగర్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ యాల్ల సాయిరెడ్డి, గ్రామ ప్రత్యేక అధికారి పీఆర్ ఏఈ నితీష్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ రమ్య, న్యాయవాదులు ఏలేటి గంగాధర్, జక్కుల శ్రీధర్, జగన్, ఆవారి రమేష్, మద్దుల గంగారాం, రాజేశ్వర్, మద్దేపల్లి మోహన్, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, కోర్టు సిబ్బంది, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News