మామూళ్ల ‘మత్తు’..! కల్తీ కల్లును పెంచి పోషిస్తున్న ఎక్సైజ్ శాఖ

ఉమ్మడి జిల్లాలో మత్తు పదార్థాల రవాణా జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా కల్లు తయారీలో వినియోగించే నిషేధిత మత్తు పదార్థం అల్ఫాజోలం వినియోగం జోరుగా సాగుతుంది.

Update: 2024-06-10 02:10 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో మత్తు పదార్థాల రవాణా జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రధానంగా కల్లు తయారీలో వినియోగించే నిషేధిత మత్తు పదార్థం అల్ఫాజోలం వినియోగం జోరుగా సాగుతుంది. గత నెల చివరి వారంలో రెంజల్ మండల కేంద్రంలో కల్లు డిపో నిర్వహిస్తున్న బైరా గౌడ్ అల్ఫాజోలం రవాణా చేస్తూ ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు చిక్కారు. అతను కల్లు ముస్తే దారు ముసుగులో నిషేధిత మత్తు పదార్థాల రవాణా దందా లో కీలకంగా ఉన్నట్లు గుర్తించి ఎక్సైజ్ శాఖ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఎక్సైజ్ అధికారులు బైరా గౌడ్ కు సంబంధించిన కల్లు డిపోలో షాంపిళ్లను సేకరించారు.

అక్కడ మత్తు పదార్థం కలిపి క్రయవిక్రయాలు జరుగుతున్నాయో కావో తేల్చేందుకు నిర్వహించిన షాంపిళ్ళ సేకరణ అంతా ప్రహసనంగా జరిగింది. ఎక్సైజ్ అధికారులు కల్లు డిపోలో కల్లు తయారయ్యే పీపాలో కల్లు సేకరించకుండా బోధన్ ఎక్సైజ్ కార్యాలయంకు మూడు కల్లు సీసాలను తెప్పించుకుని వాటితోనే శాంపిల్స్ సేకరించామని పంచనామా రాయడం గమనార్హం. కల్లు సొసైటీ ఆధ్వర్యంలో ఉండే డిపోలో కృత్రిమ కల్లు తయారీ అనేది రోజు వారిగా జరిగేదే. కానీ బోధన్ అధికారులు సేకరించిన శాంపిల్ వ్యవహారం ఇప్పుడు ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.

నిజామాబాద్ జిల్లాలో మత్తు కల్లు ను ఆబ్కారీ శాఖ ని పెంచి పోషిస్తుంది. పేరుకు మద్య పాన నియంత్రణ, మత్తు పధార్థాల రవాణా అడ్డుకట్ట వేస్తామని చెప్పే శాఖనే కృత్రిమంగా రసాయానాలతో తయారయ్యే కల్లు అమ్మకాలను ప్రోత్సహిస్తుందని చెప్పాలి. ఉమ్మడి జిల్లాలో ఈత చెట్లు, తాటి చెట్లు లేకపోయినా కల్లు మాత్రం రోజు లక్షల లీటర్లలో ఉత్పత్తి అవుతున్న విషయం తెల్సిందే. మత్తు కల్లు రసాయానాలతో చేస్తారని నిషేధిత మత్తు పదార్థాలను కలిపి విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వస్తే అందుకు సంబంధించి శాంపిళ్లు తీసి అవి మత్తు కల్లు లేక చెట్టు కల్లు అని నిర్ధారించాల్సిన శాఖనే మత్తు పదార్థాల తయారయ్యే కల్లులో కల్తీ లేదని సర్టిఫికేట్ ఇచ్చే కల్చర్ జోరుగా సాగుతుంది.

ఎక్సైజ్ శాఖ వద్ద ప్రధానంగా క్లోరో ఫాం, డైజోఫాం, క్లోరో హైడ్రెట్ లాంటి మత్తు పదార్థాలను కలిపి కల్లును తయారు చేసి విక్రయాలు జరుపుతుంటే దానిని గుర్తించి ల్యాబ్ లు సామగ్రి అంతా ఎక్సైజ్ శాఖ వద్ద ఉంది. కానీ అల్ఫాజోలం అనే నిషేధిత మత్తు పదార్థం కలిపి తయారు చేసి కృత్రిమ కల్లును గుర్తించే సామగ్రి లేదని అందుకు శాంపిళ్లను సేకరించి హైదరాబాద్ పంపడం ఆనవాయితీ వస్తుంది. ఇప్పుడు అదే శాంపిల్ సేకరణ ఎక్సైజ్ శాఖకు కాసులు కురిపిస్తోంది. కల్తీ కల్లును గుర్తించేందుకు సేకరించే శాంపిళ్ల వ్యవహారంలో ముస్తేదార్ల నుంచి డిపోల నుంచి డబ్బులు వసూలు జరుగుతున్నాయి. లేకపోతే ఎక్కడా కల్తీ కల్లు గుర్తిస్తే లైసెన్సులు రద్దు కావడం, డిపోలు మూతపడతాయని సొసైటీల నిర్వాహకులు భయపడడమే ఎక్సైజ్ అధికారులకు వరంగా మారింది.

నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ అధికారులు కల్లు డిపోలలో శాంపిళ్ల సేకరణ అనేది ఆదాయ వనరుగా మార్చుకున్నారని చెప్పడానికి రెంజల్ కల్లు డిపో వ్యవహరమే ఉదాహరణగా చెప్పాలి. కల్తీకల్లు నిషేదిత పదార్థాలతో తయారవుతున్న ఫిర్యాదులు వస్తే చాలు శాంపిళ్లు సేకరించాల్సిన ఎక్సైజ్ శాఖ దానిని మరిచిపోయింది. ఎక్సైజ్ శాఖలో పక్కాగా కల్లు డిపోను సీజ్ చేయాలంటే ఒక విధంగా, డిపోను కొనసాగించాలంటే మరొక విధంగా శాంపిళ్ల సేకరణ కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పాలి. కేసులు లెక్కల కోసమైతే నేరుగా ఎస్ హెచ్ వోనే సంబంధిత కల్లు డిపోలో వెళ్లి శాంపిళ్ల సేకరణ చేయడం ఒక విధంగా జరుగుతుంది. కానీ అధికారులకు ఇష్టం లేకపోయినా ఎవరి వాటలు వారికి వస్తే మాత్రం అధికారులు అక్కడ తనిఖీలు, షాంపూలు సేకరణకు వెళ్లకుండా ముస్తేదారులు ద్వారా కల్లును తెప్పించి ల్యాబరేటరీలు పంపుతారు. అలా అయితే కల్తీని గుర్తించడమన్నది అసాధ్యం.

ఎక్సైజ్ అధికారులు నేరుగా కల్లు డిపోలకు వెళ్తే అక్కడ ఉన్న పీపాలలో కల్లును సేకరించి ల్యాబ్ లకు పంపితే కల్తీ జరిగిందో లేదో ఇట్టే తెలిసిపోతుంది. కానీ ముస్తేదారుల ద్వారా కల్లును స్టేషన్ లకు తెప్పించుకుంటే వారు నేరుగా చెట్ల కల్లు తెప్పించ సీసాలలో అధికారులకు అప్పగిస్తే అడాల్ ట్రేషన్ జరుగుతున్న విషయమే బహిర్గతం కాదు. చెట్టు కల్లులో కొన్ని నీళ్లు కలిపి పంపితే అక్కడ కల్తీ జరుగలేదనే రిపోర్టు మాత్రమే వస్తుంది. దానిని కేసులుగా రాసి కోర్టుకు సమర్పించి డిపోల కొనసాగింపుకు హితోధికంగా సహకరిస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే శాంపిళ్ల సేకరణకు ఒక రేటు నిర్ణయించి వసూళ్ల పర్వం జరుగుతుందన్న విమర్శలున్నాయి. ఎస్ హెచ్ వో మొదలుకుని ఉన్నత స్థాయి అధికారుల వరకు నెల వారీగా మామూళ్లు దక్కుతుండడంతో అసలు కల్తీకల్లు కృత్రిమంగా తయారయ్యే మత్తు కల్లును గుర్తించే పని జరుగక మత్తు కల్లుకు ప్రజలు బానిసలవుతున్నారు.


Similar News