స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు స్వీకరించిన కలెక్టర్
: కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో నిజామాబాద్ జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్వీకరించారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ విభాగంలో నిజామాబాద్ జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డులను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్చ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అవార్డులను అందజేశారు.
కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధ, స్వచ్ఛ భారత్ జిల్లా కో ఆర్డినేటర్ నరేష్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాకు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ లో జాతీయ స్ధాయిలో మూడవ ర్యాంక్, సౌత్ జోన్ విభాగంలో రెండవ ర్యాంక్ వచ్చిన విషయం తెలిసిందే.
త్రాగునీరు, పారిశుద్ధ్య కేంద్ర మంత్రిత్వ శాఖ, జల్ శక్తి కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడిన ర్యాంకింగులలో ఓవరాల్ ఉత్తమ జిల్లా కేటగిరీలో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకులో నిలిచిన నిజామాబాద్ కు అవార్డు దక్కగా, జోన్ల వారీగా ఎంపిక చేసిన విభాగంలోనూ నిజామాబాద్ జిల్లా సౌత్ జోన్ విభాగంలో 2వ ర్యాంకులో నిలిచి ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకుంది. ఈ మేరకు ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి చేతుల మీదుగా జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి ఈ అవార్డులను అందుకున్నారు.