మోడీ ఓ లెక్కనా.. బీజేపీ ఢిల్లీ పీఠం కదులుతుంది : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
దిశ, కమ్మర్ పల్లి: నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్న మీప్రేమ వెల కట్టలేనిదని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలో మంత్రి పాల్గొన్నారు. సభలో పాల్గొనే ముందు బాల్కొండ నియోజకవర్గ మండలాల వారిగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల పేర్లు నమోదు, సభ, పార్టీకి సంబంధించిన కిట్ లు అందజేసే స్టాల్స్ ను పరిశీలించారు. వేల్పూర్ మండల స్టాల్ లో తన పేరు నమోదు చేసుకుని ప్రతినిధుల సభ ఐడి కార్డు మంత్రి వేముల తీసుకున్నారు. సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అదానీ అంబానీలకు బ్రోకర్లు గా ఉన్నోల్లు ప్రధాని అయితే తప్పు లేదు కానీ రైతుల కోసం పని చేస్తున్న కేసీఆర్ ప్రధాని అయితే తప్పా అని అన్నారు. ప్రధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు.
అమిత్ షా హైదరాబాద్ వచ్చి ప్రధాని కుర్చీ ఖాళీ లేదు అంటున్నడు.. ప్రధాని కుర్చీ మీ అబ్బ సొత్తా, మీ అబ్బ జాగీరా అని మండిపడ్డారు. హేమా హేమిలనే ప్రజలు విసిరి పారేసినరు, నరేంద్ర మోడీ ఓ లెక్కనా అని తెలిపారు. మీ కండ కావరం, అహంకారం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని కేసిఆర్ బయలు దేరిండు, బీజేపీ ఢిల్లీ పీఠం కధులుతుందని అన్నారు. మోడీ,అమిత్ షా కు కేసిఆర్ భయం పట్టుకున్నదని తెలిపారు.
దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలయ్యిందని, పక్కన మహారాష్ట్ర మొత్తం కేసీఆర్ కోసం కదిలిందని అన్నారు. మోడీ అవినీతిని ప్రశ్నిస్తున్న కేసీఆర్ ను ఇబ్బంది పెట్టాలని కవితమ్మ ను వేధిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 98 ఎమ్మెల్యే స్థానాల్లో ఘన విజయం సాధించబోతుందని, నాకు 62 శాతం పైగా ప్రజల మద్దతు ఉన్నదని తెలిపారు. 8 ఏళ్లలో ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే 6,500 కోట్ల అభివృద్ది పనులు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మధు శేఖర్, కోటపాటి నర్సింహనాయుడు, డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, నియోజవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.