ఆర్మూర్ లో భారీ చోరీ....కిలోన్నర బంగారం అపహరణ

ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మహాలక్ష్మి కాలనీలో శుక్రవారం సాయంత్రం కిలోన్నర బంగారం చోరీ జరిగింది.

Update: 2023-12-22 14:39 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని మహాలక్ష్మి కాలనీలో శుక్రవారం సాయంత్రం కిలోన్నర బంగారం చోరీ జరిగింది. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కో ఆపరేటివ్ బ్యాంకు నుండి ఓ కారులో ఆర్మూర్ పట్టణానికి చెందిన డాక్టర్ పవర్ ఈశ్వర్ చంద్ర బంగారాన్ని మహాలక్ష్మి కాలనీలో గల మహాలక్ష్మి మందిరం వద్దకు తీసుకొచ్చారు. బంగారు ఆభరణాలను కారులో ఉంచి ఆలయంలో పూజలు చేసి వచ్చేలోగా బంగారం కనిపించలేదు. దీని విలువ సుమారు కోటిన్నర ఉంటుందని బాధితుడు తెలిపారు. అనంతరం బాధితుడు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. కాగా డాక్టర్ పవర్ ఈశ్వర్ చంద్ర గతంలో వైద్య ఆరోగ్య శాఖలో మెడికల్

     ఆఫీసర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆర్మూర్ లోని పాత పోలీస్ స్టేషన్ వద్ద మెడికల్ క్లినిక్ ను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. అవసరం నిమిత్తం బ్యాంకు లాకర్ లో ఉన్న కిలోన్నర బంగారాన్ని తీసి బ్యాగులో పెట్టుకుని కారులో ఉంచారు. మహాలక్ష్మి మందిరంలో పూజలు చేసేందుకు వెళ్లడంతో అది గమనించిన దుండగులు దానిని కాజేశారు. విషయం తెలియగానే జిల్లా సీపీ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు అదనపు సీపీ జయరాం చోరీ జరిగిన సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ ఏసీపీ, ఎస్ హెచ్ ఓ తో పాటు జిల్లాలోని టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందంతో ఆర్మూర్ పట్టణం చుట్టూరా పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కారులో గల వేలిముద్రలను క్షుణ్ణంగా సేకరించారు.  


Similar News