ఫర్నిచర్ షాపుల్లో భారీ అగ్నిప్రమాదం

శివరాత్రి పర్వదినాన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది.

Update: 2024-03-09 14:53 GMT

దిశ, కామారెడ్డి : శివరాత్రి పర్వదినాన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి మూడు ఫర్నిచర్ షాపుల్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 70 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని బాధితులు, స్థానికులు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామ శివారులో దేవివిహార్ సమీపంలో గల మూడు ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దత్తాద్రి అనే వ్యక్తికి చెందిన కార్పెంటర్ వర్క్ కార్వింగ్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న చంద్రం, రాజు ఫర్నిచర్ షాపులకు మంటలు వ్యాపించాయి. షాపులలో ఫర్నిచర్ ఎక్కువగా

     ఉండటంతో మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందడంతో మూడు షాపుల్లో ఉన్న ఫర్నిచర్, కార్పెంటర్ మిషనరీస్, కార్వింగ్ మిషన్లు దగ్దమయ్యాయి. మిషన్లతో పాటు షాపులో ఉన్న డోర్లు, కిటికీలు, ఇతర విలువైన సామగ్రి కాలిబూడిదయ్యాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పక్కన ఉన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా కుదరలేదు. ఫైర్ ఇంజిన్లు రాగానే ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఆ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో మిషనరీలు, ఫర్నిచర్ మొత్తం కలిపి 70 లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. పండగ పూట జరిగిన ప్రమాదంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన అస్తినష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News