పోలీసు సైరన్ కారుతో.. లాఠీకి పనిచెప్పి యువకుడి వీరంగం..

పోలీసు సైరన్ మోత కలిగిన కారులో వెళ్తున్న ఓ యువకుడు బైక్ పై వెళ్తున్న యువకులను చితకబాదాడు.

Update: 2023-04-24 16:52 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : పోలీసు సైరన్ మోత కలిగిన కారులో వెళ్తున్న ఓ యువకుడు బైక్ పై వెళ్తున్న యువకులను చితకబాదాడు. తన కారును యువకులు బైక్ లతో ఓవర్ టేక్ చేయడాన్ని జీర్ణించుకోలేక ఏకంగా బైక్ లను వెంబడించి రోడ్డుకు అడ్డంగా కారును పెట్టి పోలీసులాఠీతో చితకబాదాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం సాయంత్రం బాధిత యువకులు స్థానిక 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన ఓ ఏఎస్సై కుమారుడు తన తండ్రికి సంబంధించిన కారులో అర్ధరాత్రి పాత కలెక్టరేట్ ప్రాంతంలో వెళ్తుండగా నగరంలోని నాందేవ్ వాడకు చెందిన ముగ్గురు యువకులు బైక్ పై వెళ్తు ఓవర్ టెక్ చేశారు.

దాంతో యువకుడు కారులో ఉన్న పోలీసు సైరన్ ను మోగించడంతో యువకులు అతన్ని పోలీసుగా భావించి అక్కడి నుంచి తప్పించుకునేందుకు యత్నించాడు. రైల్వే స్టేషన్ మీదుగా ఎన్టీఆర్ చౌరస్తా వైపు వెళ్తున్న వారిని పాత కలెక్టరేట్ గేటు వద్ద కారులో వెంబడించారు. కారును రోడ్డు మధ్యలో ఆపి ముగ్గురు యువకులను లాఠీ తీసి చితకబాదాడు. తమ తప్పేమి లేదని క్షమించాలని కాళ్లా వేళ్లా పడిన వినకుండా చితకబాదాడని బాధితులు వాపోయారు. తాను ఇటీవలనే జైలు నుంచి వచ్చానని , తనను ఏవరు ఏమి చేయలేరని బెదిరించాడని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలిసిన యువకుడు తండ్రి ఏఎస్సై ఘటన స్థలానికి వచ్చిన యువకుడు వినలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాను అధికార పార్టీ జడ్పీటీసీ ప్రధాన అనుచరుడినని, మా నాన్న పోలీసు అని తనకేమి కాదని అంటూనే కొట్టాడని యువకులు తెలిపారు.

Tags:    

Similar News