శిఖం భూమి కబ్జా.. సర్వే నెంబర్ లేకుండానే రిజిస్ట్రేషన్
మండల కేంద్రంగా వ్యవహరించ బడిన ఈ ప్రాంతం ప్రస్తుతం గజ్యా

దిశ, మాచారెడ్డి: మండల కేంద్రంగా వ్యవహరించ బడిన ఈ ప్రాంతం ప్రస్తుతం గజ్యా నాయక్ తాండ గా మారిపోయింది. శిఖం భూమి ఆక్రమణ ఒక్కటే కాదు. ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు, బోగస్ ధ్రువీకరణ పత్రాలు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, ఇండ్ల నిర్మాణాలు అన్నీ కూడా అక్రమంగానే జరుగుతున్నట్టు స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. స్థానికంగా ఒక్క లేఅవుట్ కూడా లేకపోవడం దీనికి తార్కాణం. ఇక్కడ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా ఇంటి ఓనర్ షిప్ ధ్రువీకరణ పత్రాలు, అసెస్మెంట్ నంబర్లతో నే జరుగుతాయి. అధికారిక లేఅవుట్ ఒక్కటి కూడా లేకపోవడం ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలకు నిదర్శనం. ఇంటి నెంబర్ ఒకచోట ప్లాట్ రిజిస్ట్రేషన్ మరొకచోట. ఇదే తంతు గజ్యా నాయక్ తండాలో కొనసాగుతుంది. కనీసం నాలా కన్వర్షన్ కూడా ఉండదు. కొన్ని ప్లాట్లకైతే డబుల్ రిజిస్ట్రేషన్ కూడా ఉన్నాయి.
ఇల్లు నిర్మిస్తే ముడుపులు ముట్టాల్సిందే...
మండల కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్న గజ్యానాయక్ తండాలో ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే ముడుపులు ముట్టాల్సిందే. ఎందుకంటే ఆ ఇల్లు నిర్మిస్తున్న స్థలానికి అధికారిక పత్రాలు ఏమీ ఉండవు. లేఔట్ ప్లాట్ కాదు. నాలా కన్వర్షన్ ఉండదు. 30 ఫీట్ల రోడ్డు ఉండదు. ఇంటి ఖాళీ స్థలం పైనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఖాళీ స్థలానికి కేటాయించిన ఇల్లు నెంబర్ ఎక్కడుందో తెలియదు. ఇంటి ముందు జాగా గా పేర్కొంటూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇవేమీ ఇల్లు నిర్మాణానికి కావలసిన అర్హత పత్రాలు కావు. అందుకే స్థానిక పంచాయతీ అధికారులకు వేల రూపాయల ముడుపులు అందించాల్సిందే. అప్పుడే నిర్మాణం ప్రారంభమవుతుంది.
అడ్డగోలుగా ఓనర్ షిప్ ధ్రువీకరణ పత్రాలు జారీ..
అధికారులకు ముడుపులు ముట్టాయా.. అంతే.. ఓనర్ షిప్ ధ్రువపత్రం జారీ అవుతుంది. అసెస్మెంట్ నెంబర్ కేటాయించబడుతుంది. ఇల్లు ఎక్కడుంది? స్థలం ఎక్కడుందనే విషయాలతో సంబంధం లేదు. ఇంటి నెంబర్ తో ఇల్లు సృష్టించబడుతుంది. ఇక లేఅవుట్ అనే పదమే మన పంచాయతీ అధికారులకు తెలియదు. ఇంటి స్థలానికి ఇల్లుకు ముడుపులే ఆధారం. వారి వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చిత్తు కాగితాల కిందనే లెక్క.
పట్టింపులేని అధికారులు..
ఇలాంటి విషయాలపై మండల, జిల్లా స్థాయి అధికారులకు ఫోన్ లో ఫిర్యాదు చేద్దామంటే ఫోన్ పలుకదు. ఒకవేళ పలికినా లిఫ్ట్ చేయరు. పోనీ సోషల్ మీడియాలో ఫిర్యాదు రాసి పోస్ట్ చేస్తే దాన్ని చూసిన పాపాన పోరు. ప్రత్యక్షంగా కలుద్దామంటే ఆఫీస్ లో అందుబాటులో ఉండరు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ముడుపులే శరణ్యమని సామాన్యులు స్థానిక అధికారులకు ముట్టజెప్పక మానరు. ఇప్పటికైనా జిల్లా స్థాయి ఉన్నతాధికారులు స్పందించి గజ్యా నాయక్ తండా లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటే సామాన్యులకు భరోసానిచ్చిన వారవుతారు.