ప్రజల భద్రత, నేరాల నియంత్రణకే సీసీ కెమెరాల ఏర్పాటు
ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు.
దిశ, కామారెడ్డి : ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, నిందితులను గుర్తించడానికి సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో పట్టణంలోని పలు ప్రధాన రోడ్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...సిరిసిల్ల రోడ్ లోని అయ్యప్ప స్వామి గుడి కమాన్, వీక్లీ మార్కెట్, రామారెడ్డి X రోడ్, పొట్టి శ్రీరాములు విగ్రహం, ధర్మశాల, రైల్వే స్టేషన్ X రోడ్, ప్రభుత్వ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, అంబేద్కర్ విగ్రహం, నిజాంసాగర్ X రోడ్ వరకు ప్రజల సహకారంతో, సిరిసిల్ల రోడ్ లో ఉన్న కొంత మంది ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు, వర్తక, వాణిజ్య, వ్యాపార సముదాయాల వారి సహకారంతో, తిలక్ రోడ్, సుభాష్ రోడ్ లో ఉన్న కొందరి సహకారంతో సుమారు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా పోలీస్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన సీఐ చంద్రశేఖర్ రెడ్డి తో పాటు కానిస్టేబుళ్లు కమలాకర్ రెడ్డి, విశ్వనాథ్, అజార్, తిరుపతిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ, ఎస్సైలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.