నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వడగాల్పులు, ఉక్కపోత పెరగడంతో జనం విలవిలలాడుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఈ ఏడాది వేసవి తీవ్రత అంతగా ఉండదని ప్రజలు ఊహించారు. ప్రస్తుతం అందుకు భిన్నంగా ఉండటంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు చెట్ల కింద సేద తీరుతున్నారు. భానుడి భగ భగలకు జనం అతలాకుతలమవుతున్నారు. కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పుల కారణంగా ఉదయం పూటనే ఉక్కపోత మొదలైంది.
ఉదయం 10 గంటలకే ఎండల ప్రభావం కూడా స్పష్టంగా తెలిసిపోతోంది. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు రోడ్డుపైకి వెళ్లాలంటే భయపడి అడుగు ముందుకు పడటం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల ధాటికి జనం రోడ్లపైకి రాకుండా ఇంటి పట్టునే ఉంటున్నారు. మామూలు రోజుల్లో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లు సైతం పగటి పూట బోసిపోయి ఖాళీగా దర్శనమిస్తున్నాయి. పగటి పూట రద్దీగా ఉండే రోడ్లు రాత్రి పూట రద్దీగా మారుతున్నాయి. ఎండల ప్రభావానికి వ్యాపారులు కూడా నష్టపోతున్‌నారు. షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటివి కూడా ఉష్ణోగ్రతల ప్రభావం తో గిరాకీలు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఉష్ణోగ్రతల ప్రభావానికి గిరాకీలు బాగా తగ్గాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు రూ. 5 వేలు గిరాకీ అయ్యే టీకొట్లలో రూ. 2 వేలు కూడా గిరాకీ కావడం లేదంటున్నారు.
జిల్లాలో పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో పగటి పూట ఊష్ణోగ్రతలు మరింత పెరిగి 42 నుండి 43 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 22 నుంచి 24 డిగ్రీలకు చేరుకుంటాయని , ఎండలతో పాటు, వడగాలులు, తీవ్రమైన ఉక్కపోతలు కూడా ఉంటాయని వారంటున్నారు. మార్చి నెలలోనే ఈ స్థాయిలో ఎండలు మండిపోతుంటే ఇక రానున్న ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితిని ఊహించుకోవడానికి భయంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఇంట్లో ఏసీ ఉన్న వారికి తప్ప కూలర్ లు కూడా సరిగా ఎండను, ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నాయని జనం అంటున్నారు. ఫ్యాన్స్ మూలన పడేసే ఇప్పటికే చాలా మంది ఫ్యాన్లు మూలన పడేసి కూలర్లు పెట్టుకున్నారు.
కిడ్నీ, క్యాన్సర్ పేషంట్లకు ఇబ్బందులు
జిల్లాలో కిడ్నీ, క్యాన్సర్ పేషంట్లు అధిక సంఖ్యలో ఉన్నారు. వ్యాధిగ్రస్తులుగా దీర్ఘకాలికంగా అవస్థలు పడుతున్న కిడ్నీ, క్యాన్సర్ పేషెంట్లు విపరీతమైన ఎండలు, వడగాలులతో మరింత బలహీనంగా మారే అవకాశాలున్నాయి. వీరు ఎండ వేడిని తట్టుకోవడానికి నానా తంటాలు పడాల్సి ఉంటుందని నిపుణలు చెపుతున్నారు. వారి పట్ల కుటుంబ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవాలని చెపుతున్నారు.
కనీస జాగ్రత్తలు పాటిస్తే ప్రాణాపాయం ఉండదు..
ఎండల ప్రభావానికి జనం కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా నిర్లక్ష్యంగా ఉంటే ఒక్కోసారి ప్రాణాలకు కూడా ప్రమాదమేర్పడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దాన్ని నివారించాలంటే కనీస జాగ్రత్తలు పాటించాలన్నారు. దాహం ఉన్నా లేకున్నా రోజుకు కనీసం 3 - 4 లీటర్ల నీటిని తాగాలని, కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం, గ్లూకోస్ వంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలంటున్నారు. ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పుడు అత్యవసరమైతే తప్ప బయట పనులు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీర ఉష్ణోగ్రతలను బ్యాలెన్సుడ్ గా ఉంచడానికి తేలికపాటి దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. వీలైతే వైట్, లైట్ కలర్ దుస్తులు, కాటన్ దుస్తులు వేసుకుంటే ఎండకాలంలో అనుకూలంగా ఉంటాయన్నారు. చిన్న పిల్లలకు వదులుగా ఉండే దుస్తులు, వైట్ కలర్ కాటన్ దుస్తులు వేయించాలని సూచిస్తున్నారు.
తలపై టోపీ లేకుండా బయటికెళ్లొద్దు..
ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే తలపై టోపీ ధరించాలని, మహిళలైతే స్కార్ఫ్, క్యాప్ లేదా గొడుగు వాడాలని సూచిస్తున్నారు. ఎండలో శ్రమిస్తూ అధికంగా చెమటోడ్చే వారు మరింతగా జాగ్రత్తగా ఉండాలన్నారు. వారిలో తలనొప్పి, వాంతులు, మూర్ఛ, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నీడలోకి వెళ్లి తగినంత నీరు తాగాలని, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. చిన్న పిల్లలకు తరచుగా నీరు తాగించాలని, పొడి ఆహారాలు తక్కువగా ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. వృద్ధులు, గర్భిణీలు, రక్తపోటు, షుగర్ ఉన్నవారు వేడిని తట్టుకోవడం కష్టం కాబట్టి వారు ఎక్కువగా నీడలోనే ఉండడం మేలని సూచిస్తున్నారు.