ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం శివారులో గల చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు.

Update: 2024-08-30 14:39 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం శివారులో గల చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. నగర పాలక సంస్థ పరిధిలో రోజువారీగా ఇంటింటికీ తిరిగి సేకరించే చెత్తను డంపింగ్ యార్డు వద్ద నిలువ చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చెత్తను ఆయా విభాగాల వారీగా వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వినియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానాన్ని పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.

     యంత్రాల పనితీరును కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేశారు. ప్రతిరోజూ సగటున ఎంత పరిమాణంలో చెత్తను శుద్ధి చేస్తున్నారు, ఎరువును ఎవరికి అందజేస్తున్నారు తదితర వివరాలను తెలుసుకున్నారు. చెత్తను శుద్ధి చేసే ప్రక్రియలో పాల్గొంటున్న కార్మికుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి అవసరమైన సేఫ్టీ కిట్లు అందించి వాటిని తప్పనిసరిగా వినియోగించేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెత్తను సేకరించే సమయంలోనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా తరలించాలని, ఈ మేరకు ప్రజలలోనూ అవగాహన పెంపొందింపజేయాలని సూచించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, శానిటేషన్ విభాగం అధికారులు ఉన్నారు.

అర్బన్ హెల్త్ సెంటర్ తనిఖీ

జిల్లా కేంద్రంలోని సీతారాంనగర్ కాలనీలో గల అర్బన్ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషంట్, ఇన్-పేషంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. మధుమేహం నిర్ధారణ, రక్తపరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు సంబంధించిన రాపిడ్ కిట్స్ ను పరిశీలించి, అన్ని సబ్ సెంటర్లు, పీహెచ్సీలలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

     ప్రతి రోజూ సగటున ఎంతమంది రోగులు వస్తారు, ఎంతమంది ఇన్ పేషంట్లుగా చేరుతున్నారు, స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని వైద్యులను ఆరా తీశారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీ, డిప్యూటీ డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్, డాక్టర్ అంజన తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News