అవి కరెంట్ తీగలు.. బట్టలు ఆరేసుకునే దండాలు కాదు సుమా..!

అరె పొలంలో బట్టలు ఆరేసుకోవడానికి దండాలు భలే కట్టారే.

Update: 2023-03-02 09:23 GMT

దిశ, గాంధారి : అరె పొలంలో బట్టలు ఆరేసుకోవడానికి దండాలు భలే కట్టారే. ఎన్ని బట్టలైనా ఆరేసుకునేందుకు వీలుగా ఉందే అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అవి బట్టలారేసుకునే దండాలు కాదు... కానీ చూడడానికి మాత్రం అచ్చం అలాగే కనిపిస్తున్న కరెంటు తీగలు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పిసికిల్ గుట్ట, పెద్ద గుజ్జులు శివారు పంట పొలాల్లో రైతులు గట్టు పై నుంచి ఏమరపాటుగా చేయి లేపితే అక్కడే ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొంది. ఈ కరెంటు తీగలు పొలంలో ప్రమాదకరంగా ఉన్నాయని, వాటిని సరిచేయాలని రైతులు పలుమార్లు ఏఈ, విద్యుత్ అధికారులను విన్నవించారు.

అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఏ ఒక్క విద్యుత్ అధికారి కూడా ప్రమాదకరంగా వేలాడుతున్న కరెంటు తీగలను సరిచేసిన పాపాన పోలేదు. దీంతో రైతులు మాట్లాడుతూ ప్రాణాలు పోతే కానీ విద్యుత్ అధికారులు స్పందించరా అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడెప్పుడో పెట్టిన స్తంభాలు ఇప్పుడు మనిషి వెళితే తాకుతున్న దృశ్యం చూస్తే అధికారులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారు ఇట్టే తెలిసిపోతుందన్నారు. రైతులు కరెంటు స్తంభాలకు బదులుగా కర్రలను పెట్టుకుంటున్నామని, కరెంటు సమస్యల గురించి పట్టించుకునే నాధుడు లేరని గ్రామ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News