నిజామాబాద్ జిల్లాలో న్యూ ఇయర్ కి ఎంత తాగారో తెలుసా..?

ఏ ఫంక్షనైనా.. ఏ సెలబ్రేషనైనా..మద్యం ఉండాల్సిందే.. తాగాల్సిందే.. తాగి ఊగాల్సిందే..అంటారు మందు ప్రియులు.

Update: 2025-01-01 16:52 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ జనవరి 01: ఏ ఫంక్షనైనా.. ఏ సెలబ్రేషనైనా..మద్యం ఉండాల్సిందే.. తాగాల్సిందే.. తాగి ఊగాల్సిందే..అంటారు మందు ప్రియులు. ఇక ఏడాదికోసారి డిసెంబర్ 31 రోజున జరుపుకునే న్యూ ఇయర్ హంగామా గురించి చెప్పనవసరం లేదు. న్యూఇయర్ జోష్ లో ఇక మద్యం ఉంటే ఆ కిక్కే వేరబ్బా.. అహ్.. అహ్.. అంటూ అదరగొడతారు.

గతేడాది కన్నా ఎక్కువ అమ్మకాలు..

గతేడాది కన్నా ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను మందు ప్రియులు జోరుగా జరుపుకున్నారు. ఉమ్మడి జిల్లాలో రూ. 19.5 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. గతేడాది కన్నా ఇది చాలా ఎక్కువని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కవగా ఆదాయాన్ని సమకూర్చేది ఎక్సైజ్ శాఖే కావడంతో.. ప్రభుత్వం కూడా మద్యం అమ్మకాలను ప్రభావితం చేసే ప్రత్యేక సందర్భాలను, పండుగలపై ఫోకస్ పెట్టి అధికారికంగా వెసులుబాటును కల్పిస్తుంది. ఎప్పటిలాగే న్యూ ఇయర్ సందర్భంగా మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. లైసెన్సుడ్ బార్లకు కూడా అర్ధరాత్రి ఒంటి గంట వరకు పర్మీషన్ ఇచ్చి ప్రత్యేక వెసులుబాటును కల్పించింది. ఎక్సైజ్ శాఖకు వచ్చే ఆదాయానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ తో గండి పడకుండా ఉండేందుకు ఎక్కైజ్ శాఖ, టాస్క్ ఫోర్స్ అధికారులు అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు. చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉంచి రెగ్యులర్ తనిఖీలు నిర్వహించడంతో.. ఇతర రాష్ట్రాల నుంచి చెక్ పోస్టు ద్వారా కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే అవకాశాలున్న అన్ని మార్గాలను అధికారులు కట్టడి చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ ఉమ్మడి జిల్లాకు రాకుండా కట్టడి చేయడం కూడా ఎక్సైజ్ శాఖకు అదనంగా ఆదాయం సమకూరటానికి కారణంగా అధికారులు పేర్కొంటున్నారు.

గతేడాది దాదాపు రూ.10 కోట్ల వరకు ఆదాయం రాగా..ఈ ఏడాది దాదాపు రెట్టింపు స్థాయిలో ఆదాయం పెరిగినట్లు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉమ్మడి జిల్లాలకు దొంగ చాటుగా వచ్చే మద్యానికి ఎక్సైజ్ అధికారులు పకడ్బందీగా అడ్డుకట్ట వేయడంతో..ఇది సాధ్యమైనట్లు తెలుస్తోంది. నిజామాబాద్ లో సాధారణంగా ప్రతినెల యావరేజ్ గా వంద కోట్లు మద్యం అమ్ముడవుతే..ఈనెల రూ.122 కోట్లు అమ్మకం అయ్యిదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 ఒక్కరోజే రూ.14 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.

బెల్టు షాపుల్లోనూ జోరుగా గిరాకీ..

ఎక్సైజ్ అధికారులు అక్కడక్కడా బెల్టు షాపులపై కూడా నజర్ పెట్టినప్పటికీ దొంగచాటుగా బెల్టు షాపుల్లోనూ జోరుగా అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అమ్మకాలపై అధికారిక రికార్డులు లేకపోయినప్పటికీ రూ.లక్షల్లోనే వ్యాపారం సాగినట్లు తెలుస్తోంది. బెల్టు షాపులపై అధికారుల మాట్లాడేందుకు ఆసక్తి చూపకపోయినా అమ్మకాలు దీటుగా సాగినట్లు తెలుస్తోంది. బెల్టు షాపుల నిర్వహణ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, బెల్టు షాపుల గురించి ప్రజలు అధికారులకు సమాచారం ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామని పేర్కొంటున్నారు.


Similar News