అట్లుంటది మరి అధికారులతో.. రాత్రి ఫిర్యాదు చేస్తే పొద్దున తనిఖీలు

ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాలో "అట్లుంటది మనతోని అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే.

Update: 2024-05-12 07:30 GMT

దిశ, కామారెడ్డి : ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ సినిమాలో "అట్లుంటది మనతోని అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. అదే డైలాగ్ కామారెడ్డి జిల్లా అధికారులకు సరిగ్గా వర్తిస్తుందని ఇక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు. శనివారం రాత్రి 11 గంటలకు జిల్లా కేంద్రానికి సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన గల ఓ హోటల్ ప్యాలెస్ లో అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి కుటుంబం డబ్బు కట్టలు, మద్యం బాటిళ్లు కార్లలో తరలిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే ఈరోజు ఉదయం వెళ్లి అధికారులు తనిఖీలు చేపట్టిన తీరు జిల్లా ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది.

ఎక్కడ డబ్బులు పంపిణీ చేసినా, మద్యం పంపిణీ చేసినా 1950 నంబరుకు ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలు వట్టివేనని తెలిపోయిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగించడంతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా నియోజకవర్గాల్లో ఉండటానికి వీల్లేదు. అయితే కామారెడ్డిలో మాత్రం అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి కుటుంబ సభ్యులు ఓ హోటల్ లో బస చేసి ఖాళీ చేయకుండా అక్కడే ఉన్నారు.

పైగా రాత్రి 11 గంటల తర్వాత మద్యం, డబ్బులను తమ కార్లలో యథేచ్ఛగా తరలించారు. అయితే ఇదంతా గమనించిన కొందరు పక్కా సమాచారం మేరకు వాహనాల నంబర్లతో సహా ఎన్నికల కమిషన్ ఇచ్చిన టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. కాసేపటికి పోలీసులు, అధికారులు సంబంధిత హోటల్ వద్దకు వచ్చి సుమారు రెండున్నర గంటల పాటు ఎలాంటి తనిఖీలు చేపట్టకుండా సైలెంటుగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. తనిఖీలు ఎందుకు చేయడం లేదని అధికారులను అడిగితే పై అధికారి ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నామని, హోటల్ లోపలికి వెళ్లి గదులలో తనిఖీ చేసే అధికారం తమకు లేదని సదరు అధికారులు బదులివ్వడం ఆశ్చర్యానికి గురిచేసింది. పోలీసులను అడిగినా అదే సమాధానం వచ్చింది.

దీంతో రెండున్నర గంటల వరకు కూడా పై అధికారి నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు, అధికారులు వెళ్లిన తర్వాత అధికార పార్టీ నాయకులు తమపని తాము సాఫీగా పూర్తి చేసుకుని హోటల్ నుంచి చెక్కేసారు. దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టుగా హోటల్ ఖాళీ చేశాక ఆదివారం ఉదయం వెళ్లి పోలీసులు, అధికారులు హోటల్ గదులలో, హోటల్ కు వచ్చే వారి బ్యాగులలో తనిఖీలు మొదలుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించడం కోసమే అధికారులు రాత్రి తనిఖీ చేయకుండా ఉదయం తనిఖీలు చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారో.. ఒకవేళ స్పందించిన తమ తనిఖీల్లో ఏమీ దొరకలేవని చెప్తారేమో వేచి చూడాలి.

దిశ వార్తకు స్పందన

అధికార పార్టీ ఎంపీ అభ్యర్థి డబ్బులు, మద్యం తరలింపు పై దిశ వెబ్ న్యూస్ లో ఉదయం వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత హోటల్ కు వెళ్లి తనిఖీలు చేపట్టారు. హోటల్ గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. హోటల్ కు వచ్చి పోయే వారి బ్యాగులను తనిఖీలు చేశారు. అధికారుల తనిఖీల్లో ఎలాంటి డబ్బు, మద్యం లభించలేదు.


Similar News