ధాన్యం రవాణాకు సరిపడా లారీలను తరలించాలి

అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యాన్ని త్వరత్వరగా ట్యాగింగ్ చేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.

Update: 2024-05-16 14:07 GMT

దిశ, కామారెడ్డి : అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యాన్ని త్వరత్వరగా ట్యాగింగ్ చేసి మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. గురువారం పలు మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ తో కలిసి పరిశీలించి తూకం వేసి సిద్ధంగా ఉంచిన ధాన్యపు బస్తాలను వెంటనే తరలించాలని, ఇందుకు అవసరమైన లారీలను కేంద్రాలకు పంపాలని ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ముందుగా మాచారెడ్డి మండలంలోని వేలుపుగొండ, ఫర్దీపేట, బీబీపేట, దోమకొండలలోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి ధాన్యంలో తేమ శాతాన్ని కొలిచి, తూకం చేసే ప్రక్రియను పరిశీలించారు. కేంద్రంలో ఏమైనా సమస్యలున్నాయా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలతో తల్లడిల్లుతున్న రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, అవసరమైన గన్నీ సంచులు, టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని కోరుతూ నిర్వాహకులకు సూచించారు.

    రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగింగ్ చేసిన రైస్ మిల్లులకు వెంట వెంటనే తరలిస్తూ మిల్లర్లు కూడా 24 గంటలలోగా ధాన్యం దించుకునేలా పర్యవేక్షించాలని, ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేయాలని అధికారులకు సూచించారు. రైస్ మిల్లర్లు కూడా హమాలీలను ఎక్కువగా పెట్టుకొని లారీలు వచ్చిన 24 గంటలలోగా ధాన్యం దించుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లో మిల్లుల వద్ద లారీలు వేచి ఉండరాదని, త్వరగా దించుకుంటేనే తిరిగి లోడింగ్ చేయడానికి అవకాశాముంటుందని స్పష్టం చేశారు. అకాల వర్షాల వల్ల ధాన్యం కాస్త చెడిపోయిన రైతుల పరిస్థితులను అర్థం చేసుకొని ప్రభుత్వం ఆదేశాల మేరకు ధాన్యాల్లో ఎటువంటి కోత విధించకుండా అన్ లోడ్ చేసుకొని ట్రక్ షీట్ జారీచేయాలన్నారు. మిల్లర్లు ధాన్యం దిగుమతి చేసుకోవడంలేదని అపవాదులకు తావివ్వకుండా ధాన్యం వచ్చిన వెంటనే దించుకోవాలని,

     ప్రభుత్వ పరంగా సహకార మందిస్తామన్నారు. తహసీల్ధార్లు, గిర్దావర్లు, సూపర్వైజరీ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలన్నారు. టార్పాలిన్లు, గన్ని సంచులు, లారీల సమస్య తలెత్తకుండా నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని, ఈ పక్షం రోజులు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతి రోజు కొనుగోళ్లు ఆగకుండా, రైస్ మిల్లుల వద్ద ధాన్యం దిగుబడి సమస్య రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం యావత్తు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించాలన్నారు.

     ఏమైనా ఇబ్బందులైతే కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. గత యాసంగితో పోలిస్తే ఈ యాసంగి లో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 44,182 మంది రైతుల నుండి 541 కోట్ల విలువ గల 2 లక్షల 46 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 474 కోట్లు చెల్లించామని, ట్యాబ్ ఎంట్రీ కూడా 96 శాతం మేర పూర్తి చేశామని, త్వరలో మిగతా రైతుల ఖాతాలో డబ్బులు జమచేస్తామన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇంచార్జి జిల్లా మేనేజర్ నిత్యానందం, డిప్యూటీ తహసీల్ధార్లు తదితరులు ఉన్నారు.


Similar News