ఈ సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి

ప్రజలకు ఈ వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.

Update: 2025-03-20 15:27 GMT
ఈ సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి
  • whatsapp icon

దిశ, కామారెడ్డి : ప్రజలకు ఈ వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కామారెడ్డి ఎమ్మెల్యేతో కలిసి కామారెడ్డి నియోజక వర్గంలో తాగునీటి సమస్యలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓ, ఎంపీడీఓ, డివిజనల్ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నియోజక వర్గంలో 48 గ్రామాల్లో 53.36 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లో పనులు చేపట్టి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసి త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు.

మున్సిపల్ పరిధిలో ఇప్పటికే 5 కొత్త ట్యాంకర్లు కొనుగోలు చేస్తున్నామని, పాతవి 3 ట్యాంకర్ల తో నీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన పక్షంలో మరో 4 ట్యాంకర్లు కొనుగోళ్లు చేపడతామని తెలిపారు. గ్రామాల్లో ఏమైనా సమస్యలు వస్తే గ్రామ పంచాయతీ నిధుల నుండి పనులు చేపట్టాలని, అవసరమైతే ఇతర నిధులు సమకూరుస్తామని తెలిపారు. త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడితే అవసరమైన పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని మిషన్ భగీరథ ఈఈ, జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నుండి కామారెడ్డి వరకు డి. ఐ. కొత్త పైప్ లైన్ పనులను వేగవంతం చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ లు, మండల పరిషత్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్యలు రాకుండా చూడాలని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం క్రింద మంజూరు చేసిన సి.సి. రోడ్ల పనులు మార్చి నెల లోగా పూర్తిచేయాలన్నారు.

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు నీళ్ల సమస్యలపై రొడ్డెక్కక్కుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శుల పై ఉందని, క్షేత్ర స్థాయిలో పర్యటించి ముందస్తు ప్రణాళికలతో నీటి సరఫరా అయ్యే విధంగా స్థానిక, ఉన్నతాధికారులకు సమాచారం అందించి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. అవసరమైన ప్రతిపాదనలు స్థానిక అవసరాలను బట్టి స్పష్టంగా ఒకే ఫార్మాట్ లో సిద్ధం చేయాలనీ సూచించారు. వచ్చే జూన్ మాసం వరకు నీటి సమస్యలు రాకుండా చూడాలని పేర్కొన్నారు.

పంచాయతీ కార్యదర్శులకు ప్రతీ నీటి వసతులపై అవగాహన ఉండాలని తెలిపారు. అంతిమంగా ప్రజలకు అవసరమయ్యే త్రాగునీటి సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శుల పై ఉందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న ట్యాంకర్లు అందుబాటులోకి తీసుకురావాలని, ఏమైనా మరమ్మత్తులు ఇంటే చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రమేష్, జిల్లా పంచాయతీ అధికారి మురళీ, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఎంపీడీఓ లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Similar News