ముత్యంపేట హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

కారు డబ్బుల విషయమై ఒకరిని హత్య చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు.

Update: 2025-03-28 15:12 GMT
ముత్యంపేట హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
  • whatsapp icon

దిశ, కామారెడ్డి: కారు డబ్బుల విషయమై ఒకరిని హత్య చేసిన కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దోమకొండ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన ఈరవేని రమేష్ తన భార్య పేరును ఉన్న మారుతి స్విఫ్ట్ కారును చింతామన్ పల్లి గ్రామానికి చెందిన పల్లె పోచయ్య గత సంవత్సరం డిసెంబర్ నెలలో 3,85,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. అప్పటినుంచి ఒకసారి 26300, ఈఎంఐ 13150 రూపాయల చొప్పున మొత్తం 65750 రూపాయలు ఫైనాన్సుకు పోచయ్య చెల్లించాడు. తర్వాత 1,36,000 రమేష్ కు నగదు ఇచ్చాడు. మిగతా డబ్బులు కూడా ఇవ్వాలని పోచయ్యను అడగగా ..మొత్తం ఫైనాన్స్ క్లియర్ చేసి ఇస్తే మిగతా డబ్బులు ఇస్తానని రమేష్ తో గొడవ పెట్టుకున్నాడు.

ఈ నెల 25న రమేష్ తన భార్య అనిత, పోచయ్య ముగ్గురు కలిసి ఫైనాన్స్ క్లియర్ చేసేందుకు కామారెడ్డి మహీంద్రా ఫైనాన్స్ కు రాగా.. మొత్తం లక్ష 85 వేలు చెల్లిస్తే ఫైనాన్స్ క్లియర్ అవుతుందని చెప్పడంతో పోచయ్య దానికి ఒప్పుకుని నాలుగైదు రోజుల్లో క్లియర్ చేస్తానని ఒప్పుకున్నాడు. మళ్ళీ 26న పోచయ్య వద్దకు వెళ్లిన రమేష్ డబ్బులు తనకే ఇవ్వాలని గోడవపడి వెళ్ళిపోయాడు. గురువారం చింతామన్ పల్లి శివారులో గల తన ఇటుక బట్టి వద్ద కారును నిలిపి బట్టి వద్ద ఉన్న గదిలో పోచయ్య ఫోన్ చూస్తూ ఉండగా తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కారు ఓపెన్ అయిన శబ్దం వచ్చి పోచయ్య బయటకు వచ్చి చూడగా రమేష్ కారును తీసుకుని వెళ్తున్నాడు. వెంటనే కారును ఆపిన పోచయ్య కారులో ఉన్న రమేష్ ను బయటకు లాగి కాలర్ పట్టుకోగా బట్టిలో పని చేస్తున్న ఒడిస్సాకు చెందిన కూలీలు వచ్చి విడిపించారు. వెంటనే పోచయ్య పక్కనే ఉన్న కర్ర తీసుకుని రమేష్ తలపై బలంగా కొట్టడంతో పడిపోయిన రమేష్ ను ఎలాగైనా చంపాలన్న ఉద్దేశ్యంతో రమేష్ కాళ్ళు చేతులు కట్టేసి పోచయ్య తన అల్లుడు, కూలీలతో కలిసి చచ్చేదాక తీవ్రంగా కొట్టారు. తమకు ఏమి తెలియనట్టు రమేష్ కులస్తుడు రాములుకు ఫోన్ చేసి రమేష్ ఇక్కడ పడి ఉన్నాడని చెప్పి, వెంటనే 100 కు కాల్ చేసి గొడవ జరుగుతుందని చెప్పి అక్కడినుంచి పారిపోయారు. పోలీసులు, రమేష్ భార్య వచ్చి రమేష్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడని ఏఎస్పీ తెలిపారు. రమేష్ హత్యకు కారణమైన పోచయ్య, అతని అల్లుడు హరీష్, ఇటుక బట్టి కూలీలు రాజ్ కుమార్, రమేష్, బిదేశి నాయక్ లను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో భిక్కనూర్ సీఐ సంపత్, దోమకొండ ఎస్సై స్రవంతి పాల్గొన్నారు.

Similar News