పీవీ నర్సింహారావుకు గవర్నర్, సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు.
దిశ, వెబ్‌డెస్క్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్దనున్న పీవీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాగా, వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. ఈయన స్వగ్రామం వంగర. తల్లిదండ్రులు సీతారామారావు, రుక్మిణి. పీవీ 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. 1952లో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1957 నుంచి 1972 వరకు నాలుగుసార్లు మంథని నియోజకవర్గం(కరీంనగర్) నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు.
1967లో బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్య, విద్య, దేవాదాయశాఖలు నిర్వహించారు. 1971 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1973-75 మధ్య కాలంలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. 1977లో హన్మకొండ లోక్‌సభకు ఎన్నికై ఇందిరాగాంధీ మంత్రి వర్గంలో హోం, విదేశాంగ శాఖల మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ మంత్రి వర్గంలో హోంశాఖ, మానవ వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో దేశ అత్యున్నత ప్రధాని పీఠాన్ని అదిష్ఠించారు. ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసి, దేశాన్ని ప్రగతిబాట పట్టించారు.