ఆడ బిడ్డల బాధ ఇప్పుడు గుర్తు వచ్చిందా అక్కా..! ఎమ్మెల్సీ కవితకు నెటిజన్ల కౌంటర్
ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆడబిడ్డల హక్కులను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కుతున్నదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రిజర్వేషన్ల స్ఫూర్తిని పక్కనెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అంటూ కొత్త జీవో తీసుకురావడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.
ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రాజస్థాన్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా మహిళా హక్కులకు భంగం వాటిల్లేలా ఉన్నదని, ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు నిరాకరిస్తే.. ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామన్న మీరు తెలంగాణలో ఎందుకు అమలు చేస్తున్నట్లు..? అని ప్రశ్నించారు.
ఆడబిడ్డల నోట్లో మట్టి కొట్టే ఈ జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఆమె లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు. దీంతో ఆ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఎమ్మెల్సీ కవితపై మండిపడుతున్నారు. ‘ఆడ బిడ్డల బాధ ఇప్పుడు గుర్తు వచ్చిందా అక్క.. వాళ్ల ఫ్యామిలీలను తాగుడుకు అలవాటు చేసినప్పుడు రాలేదా అక్కా’ అని ఓ నెటిజన్ తీవ్రంగా విమర్శించారు. కాగా, లిక్కర్ స్కాం వ్యవహరంలో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.