నవజీవన్ ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ప్రమాదం.. ఒక్కసారిగా పరుగులు పెట్టిన ప్రయాణికులు
నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో పొగలు చెలరేగాయి. ఆదివారం నవజీవన్ ఎక్స్ ప్రెస్ అహ్మదాబాద్ టు చెన్నై వెళ్తుండగా రైళ్లో ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకుంది.
దిశ, వెబ్‌డెస్క్: నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో పొగలు చెలరేగాయి. ఆదివారం నవజీవన్ ఎక్స్ ప్రెస్ అహ్మదాబాద్ టు చెన్నై వెళ్తుండగా రైళ్లో ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకుంది. దీంతో ట్రైన్‌లోని ప్రయాణికులు ఏం జరుగుతోందో అర్థం కాక తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైలు దిగి ప్రయాణికులు పరుగులు పెట్టారు. పొగ, మంటలను గమనించిన లోకో పైలెట్ వెంటనే అప్రమత్తమై నవజీవన్ ఎక్స్ ప్రెస్‌ను మహబూబాబాద్ స్టేషన్‌లో నిలిపివేశారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే మహబూబాబాద్ స్టేషన్‌కు చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
అయితే, ట్రైన్ బ్రేక్ లైనర్స్ పట్టేయడంతో దట్టంగా పొగ కమ్ముకున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో అధికారులు, ప్రయాణికులు అంతా ఊపీరి పీల్చుకున్నారు. నవజీవన్ ఎక్స్ ప్రెస్ మహబూబాబాద్ స్టేషన్లో నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.