గవర్నర్ తమిళిసై పై అనుచిత వ్యాఖ్యలు.. MLC కౌశిక్ రెడ్డికి ఊహించని షాక్!
భారత్ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.రాష్ట్ర గవర్నర్‌పైన ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న కమిషన్ విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఢిల్లీలోని కమిషన్ కార్యాలయంలో ఫిబ్రవరి 21న ఉదయం 11.30 గంటలకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో గత నెల 25న గవర్నర్‌ను ఉద్దేశిస్తూ అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా మహిళగా ఉన్న గవర్నర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్నది. విచారణకు హాజరుకాకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపకుండా పరిశీలన పేరుతో తన దగ్గరే ఉంచుకోడాన్ని ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి జమ్మికుంటలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా పరుష పదజాలంతో విమర్శించారు. ఈ విమర్శలపై అప్పట్లోనే రాజకీయ వర్గాల్లో దుమారం రేగింది. బీజేపీకి చెందిన మహిళా కార్పొరేటర్ (సరూర్‌నగర్) ఆకుల శ్రీవాణి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఒక మహిళా గవర్నర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్తు మహిళాలోకంపైన చేసిన వ్యాఖ్యలుగానే పరిగణించాలని పేర్కొన్నారు. మహిళలందరినీ అవమానపరచడం అని అందులో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతను మరిచి ప్రవర్తించారని, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడం ఆయన స్థాయికి తగదని, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
దానికి కొనసాగింపుగా బీసీ పొలిటికల్ జేఏసీ సైతం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసింది. గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను ఆ పదవి నుంచి భర్తరఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది. కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసేలా డీజీపీకి అదేశాలివ్వాలని కోరింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే రాజ్యాంగ పదవిని అగౌరవపరిచడమేనని ఆ ఫిర్యాదులో పేర్కొన్నది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది.
కౌశిక్‌రెడ్డి చేసిన కామెంట్లు ఏంటి?
"గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు? అసెంబ్లీ, కౌన్సిల్‌లో ఆమోదం పొందిన బిల్లులకు సంబంధించిన ఫైళ్లను ఇప్పటిదాకా గవర్నర్ తన సీటు (ము..కింద) కింద పెట్టుకొని కూర్చుంటారా? ఇది రాజ్యాంగమా? ఎందుకు క్లియర్ చేయడం లేదో జవాబు చెప్పాలి".. అని జనవరి 25న కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పాల్గొన్న ఓ కార్యక్రమంలో కౌశిక్ కామెంట్ చేశారు.