ఎన్టీఆర్ స్టేడియంలో నేషనల్ బుక్ ఫెయిర్
తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ వెల్లడించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ఈ నెల 22 నుంచి జనవరి 1 వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ వెల్లడించారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా పుస్తక ప్రాముఖ్యత తగ్గలేదని, పుస్తకం ఒక తల్లి పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తక పఠనం కూడా పెరుగుతోందన్నారు. రాబోయే తరానికి ఒక దార్శనికతను అందించేవి పుస్తకాలేనని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రం ఏర్పడిన తర్వాత జ్ఞాన తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కోసం తెలంగాణ కళాభారతి గ్రౌండ్‌ను ఉచితంగా ఇస్తున్నారని గుర్తు చేశారు. పుస్తక ప్రదర్శన 10 లక్షల మంది సందర్శించడం పుస్తక పఠనం ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు.
పుస్తక ప్రదర్శనలో 'మన ముఖ్యమంత్రి స్టాల్' ఏర్పాటు చేశామని చెప్పారు. పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవానికి మంత్రలు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రా రెడ్డి హాజరవుతారని చెప్పారు. అన్ని పత్రికల ఎడిటర్లు పాల్గొంటారని తెలిపారు. బుక్ ఫెయిర్ ప్రాంగణానికి ప్రముఖ ఒగ్గుకథ కళాకారుడు మిద్దె రాములు పేరు పెట్టామని, వేదికకు కవి అలిశెట్టి ప్రభాకర్ పేరు ఖరారు చేసినట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 వరకు, శని, ఆదివారం ఇతర సెలవు రోజుల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. బుక్ ఫెయిర్‌లో ప్రతిరోజూ విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తక ప్రదర్శనలో 300 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దాదాపుగా అన్ని భాషల్లో పుస్తకాలు, విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, ఉద్యోగార్థులకు వివిధ పబ్లికేషన్స్ వారి మెటీరియల్స్ ఈ పుస్తక ప్రదర్శనలో లభిస్తాయన్నారు. రచయితల కోసం ప్రత్యేక స్టాల్, బాలల సాహిత్యం, పురాణ సాహిత్యం, అభ్యుదయ సాహిత్యం లాంటి పలు రకాల పుస్తకాలు లభ్యమవుతాయని వెల్లడించారు. సమావేశంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ కార్యదర్శి సృతి కాంత్ భారతి, వైస్ చైర్మన్ కోయా చంద్రమోహన్, కోశాధికారి రాజేశ్వరరావు, నారాయణరెడ్డి, సభ్యులు వాసు పాల్గొన్నారు.