తార్నాకలో నర్సింగ్ కాలేజ్.. టీఎస్ ఆర్టీసీ ప్రకటన
దిశ, తెలంగాణ బ్యూరో: అధునాతన సౌకర్యాలతో
దిశ, తెలంగాణ బ్యూరో: అధునాతన సౌకర్యాలతో తార్నాక ఆస్పత్రిలో కొత్తగా "టీఎస్ ఆర్టీసీ నర్సింగ్ కళాశాల" ను ప్రారంభించబోతున్నట్లు టీఎస్ ఆర్టీసీ అధ్యక్షుడు బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం టీఎస్ ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ నర్సింగ్ కళాశాలను నెలకొల్పేందుకు రాష్ట్రానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుమతిని మంజూరు చేసిందని, ఈ విద్యా సంవత్సరం మార్చి-2022 నుంచే ప్రారంభమవుతుందని వారు స్పష్టం చేశారు. తార్నాక ఆసుపత్రిలో స్వంత వనరులతో నర్సింగ్ కళాశాలను స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన దరిమిలా ఈ కళాశాల ఏర్పాటుకు అవసరమైన అన్ని నిబంధనలు, షరతులను క్షుణ్ణంగా పరిశీలించి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కళాశాలకు అనుమతి ఇవ్వడం సంతోషదాయకమన్నారు.
ప్రతి ఏటా 50 సీట్లతో టీఎస్ ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ఆరంభం అవుతుందని, 30 సీట్లు కన్వీనర్ కోటా కింద, మరో 20 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయని వివరించారు. జంట నగరాల నడిబొడ్డున నెలకొల్పుతున్న ఈ కళాశాలలో వృత్తిపరమైన, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలల వంటి అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీ నర్సింగ్ కళాశాల ప్రవేశ వివరాలు లేదా ఇతర సందేహాల కోసం, టీ ఎస్ ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నెంబర్లు 040 68153333, 040-30102829లో సంప్రదించవచ్చని, లేదా www.tsrtc.telangana.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చని, లేదంటే నర్సింగ్ కళాశాల ముఖ్య వైద్యాధికారి, సూపరింటెండెంట్‌ను నేరుగా సంప్రదించవచ్చిని చెప్పారు. తార్నాకలో వైద్య సేవల్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడం, సంస్థ ఉద్యోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా తార్నాక ఆసుపత్రిలో ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇక్కడ మౌలిక వసతులను అభివృద్ధి పరిచే దిశలో కూడా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.