స్కూళ్లలో డ్రగ్స్ పై నిఘా..

స్టూడెంట్స్ డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అందులో భాగంగా సివిల్, నార్కొటిక్స్ పోలీసుల సమన్వయంతో ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసింది.

Update: 2024-06-12 03:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : స్టూడెంట్స్ డ్రగ్స్ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అందులో భాగంగా సివిల్, నార్కొటిక్స్ పోలీసుల సమన్వయంతో ప్రత్యేక టీమ్స్ ను ఏర్పాటు చేసింది. మఫ్టీలో ఉండే టీమ్స్ స్కూల్స్ పరిసరాల్లో డ్రగ్స్ విక్రయించే పాన్ షాపులు, కిరాణ కొట్లపై నిఘా పెట్టనున్నాయి. అలాగే పాఠశాలల్లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుదని హెచ్చరించినట్లు తెలిసింది.

ఇంటర్నేషనల్ స్కూల్స్‌పై ఫోకస్

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న పలు ఇంటర్నేషనల్ స్కూల్స్ పరిసరాల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. గతేడాది ఆ స్కూల్స్ పరిసరాల్లో గంజాయి, డ్రగ్స్ చాక్లెట్లు విచ్చలవిడిగా లభ్యమైనట్లు నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ స్కూల్స్ పరిసరాల్లో డ్రగ్స్ పెడ్లర్ల కదలికలను గుర్తించడం, పాన్ షాపులపై ప్రత్యేకంగా నిఘా పెట్టేందుకు టీమ్స్ ను ఏర్పాటు చేశారు. ఆ టీమ్ లో మఫ్టీలో స్థానిక పోలీసులు,నార్కొటిక్స్ విభాగానికి చెందిన పోలీసులు ఉంటారు. స్కూల్స్ పరిసరాలు, అలాగే పిల్లల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెట్టనున్నారు.

స్కూళ్లలో కౌన్సిలింగ్ సెంటర్ల ఏర్పాటు

ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో ఓ రిటైర్డ్ ఐపీఎస్, సైక్రియాటిస్టుతో పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని మేనేజ్‌మెంట్లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. డ్రగ్స్ తీసుకుంటే తలెత్తే ఆరోగ్య సమస్యలు, చట్టపరంగా తీసుకునే చర్యలపై పిల్లలకు కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించింది. అలాగే స్కూల్స్‌లో డ్రగ్స్ దొరికితే యాజమాన్యాలే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ మేరకు గత వారం ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్స్‌కు నార్కొటిక్ విభాగం సర్క్యులర్స్ జారీ చేసినట్లు సమాచారం.


Similar News