అందరినీ గౌరవించే ఆచారం యాదగిరిగుట్టకు ఉంది : ప్రభుత్వ విప్
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరవ్వడం శుభపరిణామమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరవ్వడం శుభపరిణామమని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయాన్ని దాదాపు గంటన్నర పాటు కలియ తిరిగి దేవస్థానంలో భక్తులు ఎదుర్కొంటున్న పలు విషయాలను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తించి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు గత పాలకులు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఇక్కడి ప్రజలు అనేక సందర్భాలలో నిలదీసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖను అవమానించినట్లు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు, అందరికీ సమానంగా గౌరవం అందించామని తెలిపారు. వారికి కేటాయించిన సీట్లు హెచ్చుతగ్గుగా ఉండడం లోపంగా చూయిస్తూ దుష్ప్రచారం చేస్తున్న నాయకులు, గమనించాలని సూచించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా కుర్చీ వేయడం జరిగిందని కాకపోతే ఉన్న కుర్చీలో ఆ కుర్చీ చిన్నగా ఉండటం, మిగతా కుర్చీలు పెద్దగా ఉండటం వల్ల అలా కనిపించిందని, ముందు వచ్చిన మంత్రులు ముందుగా కూర్చోవడం చివరగా వచ్చిన మంత్రి ఆ కుర్చీలో కూర్చోవడం వల్ల అలా కనిపించందని బీర్ల ఐలయ్య అన్నారు. ప్రతి ఒక్కరిని గౌరవించే ఆచారం యాదగిరిగుట్టకు ఉందని ఉన్న కుర్చీలో ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉండటం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవ్వడం జీర్ణించుకోలేని కొందరు ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం మానుకోవాలని హితువు పలికారు. అదే విధంగా వారం రోజుల్లో రివ్యూ సమావేశం నిర్వహించుకొని యాదాద్రి ఆలయానికి రావాల్సిన నిధులు తీసుకొని వచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. దీంతో పాటు గాలిగోపురానికి బంగారు తాపడం, అదేవిధంగా హోమం చేయాలని ముఖ్యమంత్రికి తెలిపినట్లు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. యాదాద్రిని యాదగిరిగుట్టగా పాత సంప్రదాయం ప్రకారం పేరు మారుస్తామన్నారు. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి, మంత్రులు రావడం చాలా సంతోషకరమన్నారు. కొంతమంది పని కట్టుకొని ఈ ప్రభుత్వం ప్రజా పాలనలో అభివృద్ధి వైపు వెళుతుందని ఓర్వలేక పలు విషయాలను లోపాలుగా వెతికి పెద్దగా చేసి చూపిస్తున్నారని అన్నారు.