జోష్ మీదున్న హస్తం.. సూర్యాపేటలో మాత్రం వర్గపోరుతో సతమతం..!
కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ కల నెరవేర్చుకోవాలని ఆశావహులు ప్రయత్నిస్తుంటే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నాయకులంతా ఈసారి టికెట్లు ఇచ్చే విధానం మారిందని అంటున్నారు.
దిశ, సూర్యాపేట ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ లో ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ కల నెరవేర్చుకోవాలని ఆశావహులు ప్రయత్నిస్తుంటే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ముఖ్య నాయకులంతా ఈసారి టికెట్లు ఇచ్చే విధానం మారిందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎవరు, బలంగా ఉంటే, సర్వేలు, నివేదికలు, క్యాడర్ అభిప్రాయాల్లో ఎవరికి మొగ్గు ఉంటే వారికే టికెట్టు దక్కుతుందని నియోజకవర్గాల్లోనే ఉండి పని చేసుకోవాలని సూచిస్తుండడంతో పరిస్థితి వేడెక్కింది.
జిల్లా కేంద్ర లో భట్టి విక్రమార్క పాదయాత్ర, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి జిల్లా కేంద్రంలెనే ఉంటూ ఎప్పటికప్పుడు మీటింగ్‌లు పెట్టడం, పటేల్ రమేష్ రెడ్డి పాదయాత్ర ఇలాంటి అంశాలతో సూర్యా పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుటుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుకుటుంది.ఇంతలోనే భట్టి విక్రమార్క పాదయాత్ర లో వర్గపోరుతో రెండు వర్గాల అనుచరులు కొట్టుకోవడం తో ఒక్కసారిగా కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. సూర్యా పేట కాంగ్రెస్ పార్టీ లో వర్గ పోరు అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో వరికి టికెట్ అనేది సoదిగ్ధం గా ఉండడంతో కార్యకర్తలు తలకాయలు పట్టుకుంటున్నారు.
మరోసారి బయటపడ్డ వర్గపోరు
పేట కాంగ్రెస్ పార్టీ లో మరోసారి వర్గపోరు బయటపడింది.మూడు రోజుల క్రితం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ సూర్యాపేట జిల్లాకు చేరుకోగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ క్రమంలో సూర్యాపేట మండలం కుసుమవారి గూడెం వద్దకు భట్టి విక్రమార్క కు పటేల్ రమేష్ రెడ్డి స్వాగతం పలికేందుకు అక్కడకు చేరుకున్నారు. భట్టి విక్రమార్క కు పుల దండా వేసేందుకు ప్రయత్నించగా దామోదర్ రెడ్డి వర్గం ఒక్కసారిగా జై దామన్న అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పటేల్ రమేష్ రెడ్డి ని పూలదండ వేయకుండా దామోదర్ రెడ్డి వర్గం అడ్డుకోవడంతో రెండు వర్గాల మధ్య తోపులాట చేసుకుంది. దీంతో పాదయాత్ర లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో యథావిధిగా భట్టి పాదయాత్ర కొనసాగింది.
టికెట్లపై ఎవరికీ దక్కని హామీ
రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్‌ను ఢీకొట్టడం సాదాసీదా విషయం కాదనే అంచనాతో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలను పదే పదే మారుస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు వ్యూహకర్తల నివేదికలతో పాటు, నాలుగైదు రకాల సర్వే నివేదికలు రాష్ట్రస్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గాల వారీగా, నేతల వారీగా లెక్క లు సైతం తెప్పించుకుంటూ విశ్లేషిస్తున్నారు. వీటితో పాటు పార్టీ క్యాడర్ ద్వారా వచ్చే అభిప్రాయాలను క్రోడీకరించి, ఎప్పటికప్పుడు ముఖ్య నాయకులకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఈసారి టికెట్ల కేటాయింపు ఉంటుందనే స్పష్టమైన సంకేతాన్ని పీసీసీ అధ్యక్షుడు సహా ముఖ్య నాయకులంతా తమ వద్దకు వచ్చే నాయకులకు చెబుతున్నారు. ఏ ఆశావహునికి టికెట్ వస్తుందనే హామీ ఎవరూ ఇవ్వడం లేదు.
పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడోయాత్ర మొదలుకొని, ఆ తర్వాత చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్, ఇతర ఆందోళనలతో పాటు నియోజకవర్గాల్లో పార్టీని ముందుండి నడపడంలో, ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడంలో ఆశావహులు ఏ మేర పనిచేస్తున్నారనే అంశాన్ని సైతం ఆదిష్టానం పరిశీలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తప్పనిసరిగా నిర్వహించే ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రెస్ మీట్ లతో పాటు ఎక్కడికక్కడ ప్రజల ఇక్కట్లపై స్పందిస్తున్న నాయకులెవరు, ప్రభుత్వ వైఫల్యాలను బలంగా నిలదీస్తోన్న వారెవరు, నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై బలంగా పోరాడుతున్నది ఎవరు, అధికార పార్టీపై దూకుడుగా వెళ్తున్నదెవరు, నియోజకవర్గాల్లోని బలమైన వర్గాలతో ఈ నాయకుల్లో విశ్వసనీయత ఎవరికుంది వంటి పలు లోతైన అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ ఆశావహుల ఫర్మార్మెన్స్ బట్టి అదిష్టానం నిర్ణయిస్తుందని చెబుతున్నారు. పార్టీ జాతీయ విధానాలు, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశంపై ఇప్పటికే ప్రకటించిన డిక్లరేషన్లను ప్రకటించడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకోలేమని, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో స్పష్టమైన ఓటుబ్యాంకు కలిగి ఉండడంతో పాటు, విస్తృత స్థాయిలో బలంగా ఉన్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఢీకొట్టాలంటే ఇవి సరిపోవని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు.
ఈ అంశాలతో పాటు నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు, స్థానికంగా ప్రజల్లో విశ్వసనీయత కలిగి ఉండటం, స్థానిక అంశాలపై బలంగా పోరాడే సమర్ధత కలిగి ఉండడం కూడా ఈసారి టికెట్లు సాధించడంలో దోహదపడుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి. స్థానిక సామాజిక పరిస్థితులు కూడా ఆశావహులకు కలిసొచ్చే అంశాలు కానున్నాయని, వీటన్నింటినీ క్రోడీకరించుకొని క్షేత్రస్థాయిలో బలంగా పోరాడే వారికే టికెట్లు దక్కుతుందని తెలుస్తోంది. ముఖ్య నాయకుల నుంచి ఈ రకమైన సూచనలే వస్తుండడంతో ఆశావహులు సైతం ఇకనుంచి నియోజకవర్గాల్లోనే ఉండి పని చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.కొందరు నాయకులు ఇప్పటికే తమ స్థానాల్లో ఈ తరహా దూకుడుగా వెళుతుంటే, మరికొందరు ఇంకా పట్టారానట్టు ఉన్నారని పార్టీలో చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేగా కచ్చితంగా బరిలో నిలవాలంటే క్షేత్రస్థాయిలో దూకుడు పెంచాల్సిందేననే స్పష్టత మాత్రం తాజాగా క్యాడర్లో, టికెట్ ఆశావహుల్లో, ముఖ్య నాయకుల్లో నెలకొంది.
ఎవరికీ వారే యమునా తీరే
ఎవరికీ వారే యమునా తీరే అన్న చందంగా కాంగ్రెస్ పార్టీ తీరుంది.వేర్వేరు కార్యక్రమాలతో పార్టీ లో గందరగోళం నెలకొంది. కొన్ని కార్యక్రమలతో పార్టీ ఉపందుకుంటుంది. కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిన డబుల్ బెడ్రూం, మూడెకరాల భూమి, ఇతర పథకాలను ఫోకస్ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉపాధి హామీ కార్మికులను కలుస్తూ కార్యక్రమాలను చేస్తున్నారు. కొన్ని మండలాల్లో నేతల మధ్య గొడవలు ఉండటం తో వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు ఉన్నందున పార్టీల నేతలు మాత్రం జోరుగా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
వీరితో పాటు కొంతమంది కాంగ్రెస్ నేతలు కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తుండడంతో మరింత రాజకీయ వాతావరణం వేడెక్కింది.రెండు సార్లు మంత్రి జగదీష్ రెడ్డి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ వర్గాల గా విడిపోతే బీఆర్ ఎస్ పార్టీ కి ప్లస్ గా మారనుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ టికెట్ ఇచ్చిన ఒకరునొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు కొనసాగితే సూర్యాపేట నియోజకవర్గంలో ఈసారి ఎగిరేది కాంగ్రెస్ జెండా నే అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా వర్గాలుగా కాకుండా కలిసి నడిచి పార్టీని ముందుకు కొనసాగిస్తారని పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు.