విద్యకు ఆదర్శమైన వెంపటి..

సాధారణంగా తమ తమ పిల్లలు చిన్నతనం నుండే క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలంటూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశిస్తుంటారు.

Update: 2024-12-12 09:11 GMT

దిశ, తుంగతుర్తి : సాధారణంగా తమ తమ పిల్లలు చిన్నతనం నుండే క్రమశిక్షణతో చదువుల్లో రాణించాలంటూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. దానికి తగ్గట్టుగానే ఖర్చులకు సైతం వెనకాడకుండా ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతుంటారు. మారుమూల గ్రామాల్లో ఉన్నవారైతే దగ్గరలో ఉన్న మండల కేంద్రంలోని మంచి ప్రైవేటు పాఠశాలను ఎంచుకుంటారు. మరి కొంతమంది అయితే పట్టణాల వైపు పరుగులు తీస్తూ అక్కడున్న ప్రైవేటు పాఠశాల ఎంచుకొని రూ.పెద్ద మొత్తం వేలు, లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. ఇది నడుస్తున్న చరిత్ర...!

కానీ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని కొన్ని ప్రాంతాల పరిస్థితి పైన పేర్కొన్న అంశానికి పూర్తిస్థాయిలో విభిన్నంగా ఉంటుంది..!! ఈ మాట విన్నవారికైనా.. వార్త చదివే వారికైనా విచిత్రంగానే ఉంటుంది. ఒక దశలో ఇది నిజమా..? లేక అబద్ధమా...? అని కూడా నిర్ధారించుకోలేని పరిస్థితుల్లో వారంతా ఉంటారు. అయితే వీటన్నింటికీ కరెక్ట్ సమాధానం దొరకాలన్నా..? లేక వారి సందేహాలు తీరాలన్నా..? తుంగతుర్తి మండలంలోని వెంపటి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాల్సిందే..!

వాటి వివరాలు ఏందో...? చూద్దాం...!

ఈ పాఠశాల తుంగతుర్తి మండలం, నియోజకవర్గంలోనే కాదు...ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది.ఎందుకంటే....!!క్రమశిక్షణతో చిన్నారులైన విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యా బోధన కొనసాగుతుంది. బోధనతో పాటు టీచింగ్ మెటీరియల్, చార్ట్, కృత్యాధారణ, తదితర అన్ని ఇందులో ఉంటాయి. ముఖ్యంగా ఇందులో చదివిన విద్యార్థుల్లో ఎక్కువ భాగం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వివిధ తరహాలలో జరిగే పోటీలకు ఎంపిక అవుతుంటారు. ప్రధానంగా హైదరాబాద్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న క్రీడ పాఠశాలలు, గురుకులాలు, తదితర వాటికి ప్రతి ఏటా జరిగే ప్రవేశ పరీక్షల ద్వారా వెంపటి గ్రామ పాఠశాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంపికవ్వడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. గత మూడేళ్లలో 17 మంది క్రీడా పాఠశాలలకు, 40 మంది పైన గురుకులాలకు, సైనిక్ స్కూల్, తదితర వాటికి ఎంపికవ్వడం మరో విశేషం. అందుకే ఈ పాఠశాల అంటే అందరికీ మక్కువ.

ఏటేటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య..

సాధారణంగా ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువు అంటే ఇష్టపడని వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. తమ పిల్లలకు వారేమి చెబుతారులే...? అంటూ తల్లిదండ్రులు కొట్టి పారేస్తారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి ఏటా ప్రవేశాల సంఖ్య తగ్గుతూ పోతుంది. కానీ వెంపటి గ్రామ పాఠశాలకు వచ్చేసరికి పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఏటేటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఏటా బడిబాటని (కేవలం గ్రామంలోనే) నిర్వహించడం తప్ప వేరే ప్రచారాలు నిర్వహించకున్నప్పటికీ అడ్మిషన్ల సంఖ్య మాత్రం తనంతట తానే వస్తుంది. కేవలం చదువులలో విద్యార్థుల పురోగతిని గమనించే తల్లిదండ్రులంతా నేరుగా పాఠశాలకు వచ్చి తమ పిల్లలకు అడ్మిషన్లు పొందుతారు. ఒక దశలో మా పిల్లలకు అడ్మిషన్ ఇవ్వండి అంటూ...! తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పై ఒత్తిడి పెంచడం మరో గమనార్హం. దీంతో ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల సుమారు 300 మంది విద్యార్థులతో నడుస్తోంది.

ఇతర ప్రాంతాల నుండి వెంపటి వైపు..

వాస్తవానికి తమ పిల్లల చదువు కోసం తల్లిదండ్రులు చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వైపు చూస్తారు. కానీ వెంపటి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వచ్చేసరికి “సీన్ రివర్స్” గా మారుతుంది. తమ..తమ స్వంత ప్రాంతాల్లో ప్రాథమిక పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా వాటిని కాదని తల్లిదండ్రులు వెంపటి గ్రామ పాఠశాల వైపు దృష్టి సారించడం చారిత్రాత్మకంగా పేర్కొనవచ్చు. స్థానిక విద్యార్థులే కాకుండా సుమారు 4 కి.మీ దూరంలో ఉన్న తుంగతుర్తి మండల కేంద్రం నుండి ఆటోల ద్వారా దాదాపు 60 మంది ఈ పాఠశాలకు వెళుతుంటారు. అంతే కాకుండా గాజుల గూడెం, రావులపల్లి, క్రాస్ రోడ్డు తండ, గుమ్మడవెల్లి, రామన్నగూడెం, తదితర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులంతా నెలవారి కిరాయిలు మాట్లాడుకుని ఆటోల ద్వారా పాఠశాలకు రావడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

ప్రతి ఏటా దాదాపు 50 అడ్మిషన్లు..

తమ పాఠశాలలో చేరండి..! ప్రభుత్వం ద్వారా మీ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామంటూ బడిబాట ద్వారా లేక ఇతరత్రా కరపత్రాలు, గోడపత్రికల ద్వారా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు ప్రచారాలు నిర్వహించడం చూస్తున్నాం. అయినా కూడా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపడానికి ముఖం చాటేస్తారు. ఒకవేళ ప్రవేశాలు జరిగినా ఆ సంఖ్య వేళ్ళ మీద లెక్కించే స్థాయిలోనే ఉంటుంది. కానీ వెంపటి గ్రామానికి వచ్చేసరికి ఇవేమీ ఉండవు. (కేవలం బడిబాట కార్యక్రమంలో జరిగే ప్రచారాన్ని మినహాయిస్తే). ప్రవేశాల సంఖ్య ప్రతి ఏటా 40 నుండి 50 వరకు స్వచ్ఛందంగా ఉంటుంది. ఒక్కో దశలో మా పిల్లలకు అడ్మిషన్ ఇవ్వండి అంటూ తల్లిదండ్రులు యాజమాన్యాన్ని విజ్ఞతతో కోరే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ లెక్కన ఒక్కొక్క తరగతి గదిలో 40 మంది పైనే విద్యార్థుల ఉండడం మరో ప్రత్యేకత.

టీచర్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ....

ఇంత ఘనాపాటి చరిత్రను మూటగట్టుకున్న వెంపటి గ్రామ ప్రాథమిక పాఠశాలకు మొన్నటి వరకు ఉపాధ్యాయుల కొరత వేధించినప్పటికీ కూడా పాఠశాల యాజమాన్యమంతా అంకుటిత దీక్షతో ముందుకు సాగింది. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడంతో మొదట్లో సెక్షన్ల వారిగా విభజన చేశారు. అయితే గదులు సరిపోకపోవడం వల్ల తిరిగి అంతా ఒకటిగా చేసి విద్యాబోధన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మరో మూడు గదులు తమకు కావాలంటూ ప్రధానోపాధ్యాయులు రామతార ఒక వినతి పత్రాన్ని కూడా ఎమ్మెల్యే సామెల్ కు అందజేశారు.

ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకటరామ నర్సమ్మ “దిశ”తో మాట్లాడారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషికి తోడు గ్రామస్తుల సహకారం ఉన్నందువల్లే ఒక ప్రత్యేకత తరహాలో పాఠశాలను ముందుకు నడిపిస్తున్నామని స్పష్టం చేశారు. నాణ్యమైన విద్య అందించడంలో పాఠశాల ప్రత్యేకతగా పేర్కొన్నారు. దీనికి తోడు వివిధ రకాల ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణలతో విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు.


Similar News