చిట్యాల మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం.. రెండు లక్షల కోళ్లు మృతి..
చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామ శివారులోని కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది.

దిశ, చిట్యాల : చిట్యాల మండలంలోని గుండ్రంపల్లి గ్రామ శివారులోని కోళ్ల ఫారాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది. సుమారు రెండు లక్షల కోళ్లను చంపి భూస్థాపితం చేసే ప్రక్రియను గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ ఏడి రమేష్ తెలిపారు. రోజువారీ పరీక్షల్లో భాగంగా వారం రోజుల నుండి గుండ్రంపల్లి శివారులోని కోళ్ల ఫారాల్లో కోళ్లు మృతి చెందుతున్న విషయం తమ దృష్టికి రావడంతో అనుమానంతో శాంపిల్స్ హైదరాబాద్ కు పంపించగా అక్కడ బర్డ్ ఫ్లూ పాజిటివ్ వచ్చిందని ఆయన తెలిపారు.
దాంతో శనివారం ఉదయం గుండ్రంపల్లి గ్రామ శివారులోని కోళ్ల ఫారంలో వెటర్నరీ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా సుమారు రెండు లక్షల కోళ్లను చంపి నాలుగడుగుల లోతు గుంత తీసి జేసీబీ సహాయంతో కోళ్లను పూడ్చే ప్రక్రియను చేపట్టారు. బర్డ్ ఫ్లూ ఉన్న కోళ్ల ఫారానికి 10 కిలోమీటర్ల పరిధి వరకు రెడ్ జోన్ గా పరిగణిస్తున్నామన్నారు. ఆ ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేస్తూ బర్డ్ ఫ్లూ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయం లేదని, దీనికి ప్రజలు సహకరించాలని కోరారు.