కోవర్టు రాజకీయాలకు వారే ప్రతినిధులు : ఎమ్మెల్యే

కోవర్ట్ రాజకీయాలకు ప్రతినిధులు వేనేపల్లి చంద్రరావు, ఉత్తం కుమార్ రెడ్డి అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు.

Update: 2023-10-25 11:20 GMT

దిశ, కోదాడ: కోవర్ట్ రాజకీయాలకు ప్రతినిధులు వేనేపల్లి చంద్రరావు, ఉత్తం కుమార్ రెడ్డి అని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. బుధవారం అనంతగిరి మండలం శాంతినగర్ లోని శశిధర్ రెడ్డి నివాసంలో ఎన్నికల పరిశీలకులు తక్కెళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ శశిధర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29న సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోదాడ నియోజకవర్గంలో రాజకీయ వర్తమాన పరిస్థితులపై ఆయన ఘాటుగా స్పందించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు అధికారంలో ఉండి ప్రజాధనాన్ని సూట్ కేసులకు నింపుకొని పోయింది ఉత్తమ్ కాదా ? అని.., ఉత్తమ్  అవినీతి ఎవరికి తెలియదని దుయ్యబట్టారు. కోదాడలో పేకాట క్లబ్బులు, మూడుముక్కల ఆట, మద్యం సిండికేట్, చేపల చెరువు, పిచ్చి సారా, లాడ్జి వ్యాపారాలు నడిపింది ఉత్తం కాదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో కోదాడ నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉండి నేను ఎంతో అభివృద్ధి చేశానన్నారు.

దేశానికే ఆదర్శంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలు గడపగడపకు అందుతున్నాయి, పేదల ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్య భీమా పథకం పేదలకు ఎంతో భరోసా అన్నారు. ప్రజలంతా సీఎం కేసీఆర్ వైపే ఉన్నారని ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నికల పరిశీలకులు తక్కెళ్ళపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. అధికారనికి దూరమైన కొంత మంది స్థానిక ఎమ్మెల్యేలపై దుష్ప్రచారాలు చేశారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అనేక సర్వేలు కోదాడ నియోజకవర్గంలో చేయించి అన్ని సర్వేల్లో ప్రజల వెంట ఉన్న బీసీ నేత మల్లయ్య యాదవ్ కు మంచి పేరు ఉందని గుర్తించి మళ్లీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించారన్నారు. పార్టీలో పదవులు పొంది అనుభవించి పార్టీని వీడిన వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. అసంతృప్తితో ఉన్న నాయకులకు సీఎం కేసీఆర్ తప్పకుండా సముచిత స్థానం కల్పిస్తారని, కోదాడ నియోజకవర్గంలో శశిధర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో విద్యాసంస్థలను అమ్ముకొని ఉద్యమాన్ని నిలబెట్టారన్నారు.

అసంతృప్తిలో ఉన్న శశిధర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ శిరీష లక్ష్మీనారాయణను మంత్రి కేటీఆర్ కేసీఆర్ లతో మాట్లాడించి పార్టీ మారకుండా వారు మనసు మార్చుకొని బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తూ గెలుపు కోసం కృషిచేస్తారని ప్రకటించారన్నారు. శశిధర్ రెడ్డికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల వద్ద మంచి పేరు ఉందని, సీఎం సభకు భారీగా తరలిరావాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులు శశిధర్ రెడ్డి మాట్లాడుతూ..... 2018లో వేనేపల్లి చంద్రరావు వాల్లనే పార్టీ టికెట్ కోల్పోయాను అని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు నెలల క్రితం కూడా మళ్లీ కోదాడ బీఆర్ఎస్ టికెట్ తనదేనని చంద్ర రావు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ఎంతో జరిగిందని పార్టీ వదులుకోవడానికి మనసు ఒప్పుకోలేదన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ల ఆదేశాల మేరకు కోదాడలో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ గెలుపుకు కృషి చేస్తానన్నారు. పార్టీ వీడిన వారిని తిరిగి రావాలని కోరారు. కోదాడ నియోజకవర్గంలో పార్టీని గెలిపించి తన సత్తా చూపిస్తానన్నారు. ప్యాకేజీలకు ఎవరెవరు అమ్ముడుపోయారో బయటపెట్టాలని విమర్శలు గుప్పించే వారిపై ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అజయ్ కుమార్, కాసాని వెంకటేశ్వర్లు, ఏలూరి వెంకటేశ్వరరావు, శీలం సైదులు, పాలడుగు ప్రసాద్, సతీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News