Road works : ఈ రోడ్లను ఎంత వర్ణించినా తక్కువే..!
అడుగుకో గుంత.. రాళ్లు తేలి నరకాన్ని చూపిస్తున్న తీరు...! కొన్నింటికి నిధులు మంజూరైన మొదలుకాని పనులు..!!
దిశ, తుంగతుర్తి : అడుగుకో గుంత.. రాళ్లు తేలి నరకాన్ని చూపిస్తున్న తీరు...! కొన్నింటికి నిధులు మంజూరైన మొదలుకాని పనులు..!! మరి కొన్నింటికి నిధులు లేక ఏళ్ల తరబడి నిరసిస్తున్న తీరు..! ఇలా ఈ రోడ్ల గురించి ఎంత వర్ణించినా తక్కువే..! మొత్తానికి ప్రజానీకాన్ని భయపెడుతున్న ఈ రహదారులు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందినవి.
నియోజకవర్గంలో నూతనకల్, మద్దిరాల, తుంగతుర్తి, నాగారం, తిరుమలగిరి, అర్వపల్లి, శాలిగౌరారం, మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఉన్న రహదారుల దుస్థితి చూస్తే వాటిపైన ప్రయాణించకుండానే ప్రాణాలు పైపైనే తేలిపోతాయి. ప్రధానంగా పస్తాల - గుండెపురి, అన్నారం - సంగేమ్, తిమ్మాపురం - కోడూరు - సంగేమ్, నూతనకల్ - వెంకేపల్లి - సంగేమ్, మద్దిరాల - ముకుందాపురం, పస్తాల - చెన్నాపురం - పనిగిరి, రామచంద్రపురం, మద్దిరాల, రావులపల్లి - అరిపిరాల, అన్నారం - సంగేమ్, గుండెపూరి - పస్తాల - బండరామారం, తుంగతుర్తి పట్టణ మెయిన్ రోడ్డు, తదితర ప్రాంతాల రోడ్ల దుస్థితి ఎంత వర్ణించినా తక్కువే.
ముఖ్యంగా రోడ్లపై సాగే ప్రయాణాల వల్ల తరచుగా ప్రమాదాలు జరగడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా తీవ్ర స్థాయిలో తలెత్తుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. రోడ్ల పరిస్థితి మెరుగుపరచాలంటూ అనేక గ్రామాల ప్రజానీకం ఏండ్ల తరబడి అధికార యంత్రాంగాలకు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. కానీ వాటి పరిస్థితుల్లో మార్పులు కనబడడం లేదు. మరికొంతమంది వివిధ తరహాలలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రావులపల్లి - చౌళ్ళతండ ప్రాంతాల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ గిరిజనులు వర్షంతో బురద గుంటలుగా మారిన రోడ్డుపై వరి నాట్లు వేసి ఇప్పటికే నిరసన తెలిపారు.
ఇదిలా ఉంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నోటిఫికేషన్ వస్తుందనే ప్రధాన కారణం పై కొన్ని రహదారుల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం నిధులు కేటాయించినట్లు జీవో విడుదల చేసింది. దీంతో అప్పటి ఎమ్మెల్యే (ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే) డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అప్పటి మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డిలతో కలిసి కిషోర్ కుమార్ గత ఏడాది సెప్టెంబర్ 29న శంకుస్థాపనలు చేశారు. అయితే నిధుల విడుదలలో జాప్యంతో పాటు ఎన్నికల కోడ్ కారణాలుగా మారి రోడ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. అనంతరం ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ కూడా పనులు మొదలు కాలేదు. ఈ రోడ్లకు నిధులు విడుదల జరగకపోవడమే కారణంగా తెలుస్తోంది. ప్రస్తుత శాసనసభ్యులు మందుల సామెల్ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదికలు పంపారు. దీనిపై నేటికి కూడా ఎలాంటి క్లారిటీ రాలేదు. వెంటనే రోడ్ల నిర్మాణం పై దృష్టి సారించాలని ఆయా ప్రాంతాల ప్రజానీకం విజ్ఞప్తి చేస్తోంది.