Collector : డిజిటల్ కార్డు సర్వేను పూర్తి స్థాయిలో నిర్వహించాలి

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించే విధంగా ప్రభుత్వం జారీ చేయనున్న డిజిటల్ కార్డు సర్వే పూర్తిస్థాయిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జిండగే అన్నారు.

Update: 2024-10-04 10:45 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించే విధంగా ప్రభుత్వం జారీ చేయనున్న డిజిటల్ కార్డు సర్వే పూర్తిస్థాయిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కె. జిండగే అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో గల పైలెట్ 8వ వార్డును కలెక్టర్ పరిశీలించారు. సర్వే తీరును పరిశీలించి అధికారులకు తగిన సలహాలు, సూచనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కుటుంబంలో ఉన్న వ్యక్తుల పేర్లు, జండర్, పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబంతో ఉన్న సంబంధం, ఆధార్ నెంబర్, అడ్రస్ తదితర వివరాలన్నీ పక్కాగా ఏ ఒక్కటి మిస్ కాకుండా నమోదు చేయాలన్నారు.

సర్వే చేయడానికి ప్రత్యేకంగా నియమించిన బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ఎలాంటి తప్పులు లేకుండా సర్వే చేయాలని బృంద సభ్యులను ఆదేశించారు. మున్సిపాలిటీలో ఎనిమిదో వార్డు లో రెండు టీంలు సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పైలెట్ వార్డు లో 210 కుటుంబాలు ఉన్నాయని, అందులో 65 కుటుంబాలను సర్వే పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ దేశ్య నాయక్, టీం సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Similar News