సూర్యాపేట జిల్లాకు ఎస్సారెస్పీ రెండో దశ నీటి విడుదల

ఎట్టకేలకు సూర్యాపేట జిల్లా వైపు శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాలు విడుదలయ్యాయి.

Update: 2024-03-12 10:16 GMT

దిశ, తుంగతుర్తి: ఎట్టకేలకు సూర్యాపేట జిల్లా వైపు శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాలు విడుదలయ్యాయి. ముందస్తుగా ప్రకటించిన ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకు జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ఏఈ అమర్ కుమార్ గేట్లను ఎత్తి లాంఛనంగా నీటి విడుదల చేశారు. తొలుత ఒక వెయ్యి క్యూసెక్కుల నీళ్లను కాలువలకు వదిలారు. క్రమక్రమంగా దీన్ని పెంచుతామని ఆయన “దిశ” కు తెలిపారు. ముఖ్యంగా వారబంది పద్ధతిన ఈ ఏడాది జనవరి 8న బయ్యన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, తదితరులతో కలిసి గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు.

ఈ లెక్కన జనవరి 8 నుంచి 15, 23 నుంచి 30, ఫిబ్రవరి 7 నుంచి 14, 22 నుంచి 29, మార్చి 8 నుంచి 15 వరకు, 23 నుంచి 30 వరకు నీటి విడుదల చేసే విధంగా షెడ్యూల్ ఖరారైంది. అయితే పై భాగంలో ఏర్పడ్డ పరిస్థితుల వల్ల బయ్యన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి నీటి రాకడ పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీనికి తోడు రిజర్వాయర్‌లో అప్పటికే ఉన్న నీటి నిలువలు కూడా ఘోరంగా తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి పరిస్థితుల ప్రభావంతో సూర్యాపేట జిల్లా వైపు నీటి విడుదల నిలిచిపోయింది. కాల క్రమేణా పరిస్థితులు అనుకూలించి పైభాగం నుంచి నీళ్లు రాకడ మొదలై బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి చేరుతోంది. దీంతో మంగళవారం అధికారులు సూర్యాపేట జిల్లాకు నీటి విడుదల చేశారు. ఈ మేరకు 69,70,71 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాలలోని గ్రామాలకు నీళ్లు చేరనున్నాయి.

ఊపిరి పీల్చుకున్న రైతాంగం...

విడుదల చేసే నీటిని కేవలం ఆరుతడి పంటలకే వినియోగించుకోవాలంటూ ఎస్సారెస్పీ రెండో దశ అధికారులు మొదట్లోనే ఒక హెచ్చరికంగా పేర్కొంటూ రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. అయితే అప్పటికే చాలా గ్రామాల్లో వరి పంటల సాగు ప్రారంభమైంది. దీనికి తోడు నీటి రాకడ మొదలవడంతో ఉత్సాహంగా రైతాంగం మరికొంత వరి సాగు చేపట్టింది. చివరికి ఏర్పడిన పరిస్థితుల ప్రభావంతో నీళ్లు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల్లో కొంతమేర పంటలు కూడా ఎండు దశకు చేరాయి. ప్రస్తుతం నీటి విడుదల ప్రారంభం అవడంతో రైతాంగం హర్షాన్ని వ్యక్తం చేస్తోంది. పోయిన పంట పోగా ఉన్న పంటనైన కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో రైతాంగం భావిస్తోంది.


Similar News