పోచంపల్లిలో బీఆర్ఎస్ నాయకుల ఆగడాలు!.. మున్సిపల్ స్థలానికి ఎసరు
ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసుడే.. అమ్ముకుని సొమ్ము చేసుకునుడే.. ఇలాంటివి ప్రధానంగా అధికార పార్టీ నేతలు చేసుకుంటున్నట్లు అనేక సంఘటనలు చూస్తున్నారు.
దిశ, నల్గొండ బ్యూరో: ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జా చేసుడే.. అమ్ముకుని సొమ్ము చేసుకునుడే.. ఇలాంటివి ప్రధానంగా అధికార పార్టీ నేతలు చేసుకుంటున్నట్లు అనేక సంఘటనలు చూస్తున్నారు. అందులో భాగంగానే పోచంపల్లి పట్టణ కేంద్రంలో మున్సిపల్ కు కేటాయించిన స్థలాన్ని విక్రయించుకొని సొమ్ము చేసుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు అడ్డు తగిలిన ఖాతారు చేయకుండా అధికార పార్టీ నేతలు భూమిని విక్రయించి జేబులు నింపుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శీమిత్ర వెంచర్ లో..
పోచంపల్లి గ్రామపంచాయతీగా సమయంలో దాదాపు 2006- 07 సంవత్సరంలో డిటిసిపి లేఅవుట్ తో శ్రీ మిత్ర అనే పేరుతో పోచంపల్లి కేంద్రంలో683/p, 708/p, 709/p, 710/p, 738/p, 739/p, 711/p, 716/p, 734/p,736 సర్వే నెంబర్లలో వెంచర్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం మొత్తం వెంచర్లో 10 శాతం భూమి గ్రామపంచాయతీ కి సుమారు పదివేల గజాల భూమిని కేటాయించారు . అప్పటి నుంచి గ్రామపంచాయతీ ఆధీనంలోనే ఉంది. ఆ మున్సిపాలిటీ గా మారిన తర్వాత మున్సిపల్ కమిషనర్ ఖాళీగా ఉన్న ఆ స్థలంలో డంపింగ్ యార్డ్ గా ఉపయోగిస్తున్నారు .
స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను ..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోచంపల్లి మున్సిపల్ కేంద్రంలో భూముల విలువ రోజురోజుకు పెరిగిపోతుంది. ఖాళీగా జాగా కనిపిస్తే కబ్జా చేసేందుకు కొంతమంది అధికార పార్టీ నేతలు జెట్ స్పీడ్ లో దూసుకు వస్తున్నారు. అందులో భాగంగానే శ్రీ మిత్ర ఏర్పాటు చేసిన వెంచర్ లో సుమారు పది వేల గజాలు ఖాళీ జాగా కనిపించింది. ఈ భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్న అధికార పార్టీ నేతలు కుట్రకు తెర లేపారు.
శ్రీ మిత్ర వెంచర్ యజమానితో మాట్లాడి కొత్తగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి గజానికి 4000 చొప్పున మొత్తం పదివేల గజాల భూమిని సుమారు రూ. 4కోట్లకు విక్రయించినట్లు సమాచారం రిజిస్ట్రేషన్ కూడా దాదాపు 15 రోజుల క్రితమే పూర్తయిందని తెలిసింది. ముందుగానే ఈ భూమి పై అధికార పార్టీ నేతల కళ్ళు పడ్డాయని గ్రహించిన మున్సిపల్ కమిషనర్ బీబీనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో సర్వే నెంబర్లతో సహా లిఖితపూర్వక రాసిచ్చి ఎలాంటి క్రయవిక్రయాలు వీటిపై జరుపకూడదని పిటిషన్ అందజేశారు . అయినా ఆ పిటిషన్ లెక్కచేయకుండా సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేసినట్టు సమాచారం
కోటి రూపాయలు కమీషన్
పదివేల గజాల భూమిని విక్రయించడంలో పట్టణానికి చెందిన ఓ కీలక ప్రజా ప్రతినిధి ప్రధాన భూమిక పోషించినట్లు సమాచారం. అయితే ఈ భూమి విక్రయించడం వల్ల కోటి కమీషన్ పొందినట్లు తెలిసింది. అందులో రూ.60 లక్షలు ఆ ప్రజాప్రతినిధికి కాగా మిగతా పార్టీ నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిపి రూ.40 లక్షలు పంపిణీ చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు వినికిడి.మున్సిపాలిటీ కి చెందిన భూమిని అక్రమంగా విక్రయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికార పార్టీ నేతలు ఇందులో ప్రధానంగా ఉన్నందువల్ల చర్యలు తీసుకుంటారా లేదా అనేదే చూడాలి. ప్రజల కోణంలో ఆలోచించి చర్యలు తీసుకుంటారా లేదా అధికార పార్టీ నేతలకు అధికారులు లొంగిపోతారా ఏం జరుగుతుందో చూడాలి మరి.