యాదాద్రిలో కుళ్లిన కోడిగుడ్ల కలకలం..
యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్ వాడీ కేంద్రాలకు కుళ్లిన, నాసిరకం
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా అంగన్ వాడీ కేంద్రాలకు కుళ్లిన, నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా, సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకోకపోవడం పై విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్ ఇచ్చే మామూళ్లకు ఆశపడే జిల్లా అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. గుడ్లు, పాలతో పాటు పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇస్తోంది. గుడ్డు నుంచి పోషకాలు బాగా అందాలంటే దాని బరువు 44 గ్రాముల నుంచి 50 గ్రాముల బరువు ఉండాలని సూచించింది.
ఒక ట్రే లో ఉన్న గుడ్ల బరువు దాదాపు కిలోన్నర ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు 30 గ్రాముల కన్నా తక్కువ బరువున్న, కుళ్లిన గుడ్లను కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం భువనగిరి పట్టణంలోని ముదిరాజ్ వాడ అంగన్ వాడి కేంద్రంలో పిల్లలకు ఉడకబెట్టిన కోడి గుడ్డు ఇవ్వగా అది పూర్తిగా కుళ్ళిపోయింది.నెల రోజుల క్రితం కూడా ఇలాగే కుళ్ళిన కోడి గుడ్డు కలకలం రేపింది.ఇప్పటికైనా అధికారులు గుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.