రేషన్ షాపులే బియ్యం దందాకు కేంద్రాలు...?

పేదలకు పంపిణీ చేసే బియ్యం అక్రమార్కుల పాలవుతున్నాయి.. నిత్యం ఎక్కడో చోట అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాలను పట్టుకోవడం, వాహన యజమాని లేదా డ్రైవర్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపడం సహజంగా జరుగుతుంది.

Update: 2024-06-18 14:11 GMT

దిశ, నల్గొండ బ్యూరో : పేదలకు పంపిణీ చేసే బియ్యం అక్రమార్కుల పాలవుతున్నాయి.. నిత్యం ఎక్కడో చోట అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాలను పట్టుకోవడం, వాహన యజమాని లేదా డ్రైవర్ పై కేసు నమోదు చేసి జైలుకు పంపడం సహజంగా జరుగుతుంది. అయితే అసలు దందా చేసే వ్యక్తులపై కేసులు నమోదై జైలు పాలైన సంఘటన చాలా అరుదు. నిజమైన అక్రమార్కులకు చట్టపరమైన శిక్ష వేయకపోవడం వలన రేషన్ బియ్యం దందా నిత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఆ దందాలకు కేంద్రాలుగా ప్రధానంగా రేషన్ షాపులే ఉన్నాయని చర్చ జరుగుతుంది

నల్గొండ పట్టణంలో దాదాపు 82 రేషన్ దుకాణాలు పనిచేస్తున్నాయి. ఈ మొత్తం షాపుల్లో సుమారు 50059 రేషన్ కార్డులు ఉన్నాయి. మొత్తం దుకాణాల నుంచి 39783 మంది రేషన్ కార్డు యజమానులు బియ్యం తీసుకున్నట్లు రికార్డులో నమోదైంది. అంటే దాదాపు ప్రతి షాప్ లో నెలకు 100 నుంచి 150 క్వింటాల బియ్యం పంపిణీ జరుగుతుంది. ప్రతి షాప్ లో 75 శాతానికిపైగా మంది బియ్యం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం 82 షాపుల్లో 79.47 శాతం మంది ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని తీసుకున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

కొంతమంది లబ్ధిదారుల నుంచి రేషన్ డీలర్లు బియ్యంకు బదులుగా కిలోకు రూ.8 నుంచి రూ.10ల చొప్పున డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలా కొనుగోలు చేసిన బియ్యాన్ని మరుసటి నెల బియ్యం కోటా కింద లబ్దిదారులకు పంపిణీ చేసి, ఆ నెలలో ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యాన్ని గోదాం నుంచి నేరుగా బియ్యం వ్యాపారులకు పంపిస్తారని సమాచారం. ప్రతినెల ఇదే తంతు జరుగుతుంది. ఇలా పట్టణంలో 50 శాతం మంది రేషన్ డీలర్లు బియ్యం దందా చేస్తున్నట్లు సమాచారం.

అంతేగాకుండా గ్రామాలలో రేషన్ కార్డులు ఉండి బ్రతుకుతెరువు కోసం పట్టణాలకు వచ్చిన పేదలు ఎక్కడ నివాసం ఉంటే అక్కడ రేషన్ సరుకులు తీసుకోవడానికి పోర్టబిలిటీ పేరుతో ప్రభుత్వం అవకాశం కల్పించింది. దాంతో పేదల ఎక్కడ నివసిస్తే అక్కడ బియ్యం తీసుకుంటున్నారు. దీని ద్వారా కొంతమంది డీలర్లు 100 నుంచి 150 క్వింటాళ్ల వరకు పోర్టబిలిటీ కింద పంపిణీ చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ పోర్టబులిటీ కింద పంపిణీ చేసిన బియ్యంలో 90% డీలర్లే కొనుగోలు చేసి దందా చేస్తారన్న విషయం బహిరంగ రహస్యమే.

పట్టణంలో ప్రధానంగా 20 మంది రేషన్ డీలర్లు కేవలం ఈ బియ్యం దందా మీదనే పూర్తి దృష్టి సారించి పనిచేస్తున్నట్లు అందరూ చర్చించుకుంటున్నారు . అందులో ప్రధానంగా దేవరకొండ రోడ్డు న్యూ ప్రేమ్ టాకీస్ చౌరస్తా, ఓల్డ్ సిటీ, మాన్యం చెల్క,, పద్మావతి కాలనీ, గౌతమి కాలేజీ సమీపంలో ఉన్న రేషన్ షాపులు, బీట్ మార్కెట్, వీటి కాలనీ , పానగల్ లతో పాటుగా మరి కొంతమంది బియ్యం దందాలో ఉన్నారని సమాచారం.

అయితే రెగ్యులర్ గా షాపుకు కేటాయించబడే బియ్యం, పోర్టబిలిటీ కింద పంపిణీ చేసే బియ్యం రెండింటిలో కలిపి 200 నుంచి 250 క్వింటాళ్ల బియ్యం దందా డీలర్లు నిర్వహిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. "" రేషన్ బియ్యం దందాలో ఎవరి వాటా వారికి వెళుతుంది .... అందుకే మా పని సాఫీగా జరుగుతుంది.,ఇక మాకేం భయం""అంటూ బహిరంగంగానే బియ్యం వ్యాపారం చేస్తున్న కొంతమంది రేషన్ డీలర్లు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై రెవెన్యూ, సివిల్ సప్లై అధికారులను వివరణ కోసం ప్రయత్నించగా తమ పరిధిలో కాదని ఇద్దరూ అధికారులు చెప్పడం విశేషం..


Similar News