సీఎంఆర్ సేమ్ సీన్.. మొండికేస్తున్న మిల్లర్లు
మిల్లర్ల నుంచి బకాయిల వసూల్లలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పౌరసరఫరాల శాఖకు రావలసిన సీఎంఆర్ బకాయిలపై అధికారులు దృష్టి సారించడం లేదనిపిస్తుంది.

దిశ, సూర్యాపేట: మిల్లర్ల నుంచి బకాయిల వసూల్లలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పౌరసరఫరాల శాఖకు రావలసిన సీఎంఆర్ బకాయిలపై అధికారులు దృష్టి సారించడం లేదనిపిస్తుంది. 2023-24 యాసంగి సీఎంఆర్ లక్ష్యం 1,62,140 మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పటి వరకు ఇచ్చింది 1,02,143 ఇంకా సుమారు 60,000 మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉంది. గడువు దాటినా తమకు కేటాయించిన లక్ష్యాన్ని తిరిగి ఇవ్వడంలో తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. జిల్లాలో ప్రతి సీజన్ లోనూ ఇదే పరిస్థితి నెలకొంటుంది. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి బియ్యం ఇవ్వకుండా సొంత వ్యాపారం చేయడంతో ఈ పరిస్థితి ఎదురవుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023-24 యాసంగికి సంబంధించి ఇంకా 35 శాతానికి పైగా బియ్యం రావాల్సి ఉంది.
పలుమార్లు గడువు పొడిగించినా మిల్లర్ల దోబూచులాట
2023-24 రబీ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటు వంటి 49 మిల్లులకు ధాన్యాన్ని కేటాయించారు. ఈ ధాన్యాన్ని మూడు నెలల లోగా మరాడించి తిరిగి పౌరసరఫరాల శాఖకు అందించాలి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,62,140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించింది. సంవత్సరం కావస్తున్నా లక్ష్యంలో ఇంకా 35% బకాయి ఉంది. ఈ బియ్యం రాబట్టేందుకు ప్రభుత్వం పలుమార్లు గడువు పొడిగించినా లక్ష్యాన్ని పూర్తి చేయడంలో మిల్లర్లు దోబూచులాడు తున్నారు. ఇప్పటి వరకు 1,02,143 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే మిల్లర్లు తిరిగి ఇచ్చేయగా,మరో 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం బకాయిలు ఉన్నట్టు సమాచారం.
పెద్ద ఎత్తున అక్రమాలు
జిల్లాలో సీఎంఆర్ విషయంలో ప్రతి సీజన్ లో మిల్లర్లు మాయాజాలం చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన వరి ధాన్యాన్ని సమయానికి మర ఆడించి బియ్యం ఇవ్వడం లేదు. ఈ విషయంలో కొన్నేళ్లుగా పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయన్న బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధాన్యం ఇచ్చిన మూడు నెలలకే బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 2023-24 యాసంగి సీజన్ కు ఇప్పటివరకు ప్రభుత్వం మూడు సార్లు గడువును పొడిగించింది. అయినా జిల్లాలోని 11 మిల్లులు మాత్రమే పూర్తిస్థాయిలో బియ్యాన్ని ఇచ్చేశాయి. మిగతా వాటిలో 38 మిల్లులు 90 శాతానికి పైగా ఇవ్వగా మరో 10 నుంచి 11 మిల్లుల నుంచి పెద్ద ఎత్తున సీఎంఆర్ ఇవ్వాల్సి ఉంది. సీఎంఆర్ సేకరణలో అధికారులు నిత్యం తనిఖీలు, సమీక్షలు చేపడుతున్నా ప్రయోజనం ఉండటం లేదు. ఇచ్చిన గడువు ముగిసిన ఇంతవరకు సీఎంఆర్ అప్పగించకపోవడం తో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతిసారి ఇదే తంతు
జిల్లా సివిల్ సప్లై శాఖ అధికారుల నిర్లక్ష్యపు ధోరణి వల్ల మిల్లర్లు ధాన్యాన్ని పెట్టడంలో వెనకాడుతున్నట్టు తెలుస్తుంది. గతంలో ని సీఎంఆర్ బకాయిలు కూడా ఇంకా పెండింగ్ ఉన్నాయి. గత ఏడాది నుండి అప్పగించిన ధాన్యాన్ని మిల్లర్ల నుండి తిరిగి రాబట్టడంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పుమంటున్నాయి. సీఎంఆర్ బియ్యం రికవరీ విషయంలో ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తేస్తున్న కొంతమంది అధికారులు మాత్రం మీనమేషాలు లెక్క బెడుతున్నారన్నానీ నేటిజెన్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సీఎంఆర్ వ్యవహారం వెనకాల లక్షలాది రూపాయలు సంబంధిత అధికారులకు ముట్టినట్టు బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మిల్లర్లపై తగు చర్యలు తీసుకొని సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తిగా చేకూరేలా చూడాలని జిల్లా ప్రజాలు కోరుకుంటున్నారు.
పెండింగ్‌లో ఉన్న బకాయిలు రికవరీ చేస్తున్నాం
గత సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఎప్పటికప్పుడు మిల్లర్లను అప్రమత్తం చేస్తున్నాం. ఇప్పటికే జిల్లా లోని కొన్ని మీల్లులు పూర్తిస్థాయి బియ్యాన్ని ఇచ్చేశాయి. కొన్ని మిల్లులు బియ్యాన్ని ఇవ్వడంలో వెనకబడుతున్న వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. . ఈనెల 17 తారీకు వరకు గడువు ముగిసింది. గడువు పొడిగింపు విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. తొందరలోనే సీఎంఆర్ లక్ష్యాన్ని 100% పూర్తి చేస్తాం:-జిల్లా పౌరసరఫరాల మేనేజర్ టి.ఎన్.ఎస్ ప్రసాద్..