వాహనాలకు అనుమతి లేకపోతేనేం.. ఎడ్లబండ్లతో ఇసుక తరలింపు
పేద, ధనిక అనే తేడా లేకుండా కనీసం ఉండటానికి గూడు కట్టుకోవాలంటే ఇసుక ప్రధానంగా అవసరం ఉంటుంది. అలాంటి ఇసుక నేడు ఖరీదైనా వస్తువుగా మారిపోయింది.
దిశ, తిరుమలగిరి: పేద, ధనిక అనే తేడా లేకుండా కనీసం ఉండటానికి గూడు కట్టుకోవాలంటే ఇసుక ప్రధానంగా అవసరం ఉంటుంది. అలాంటి ఇసుక నేడు ఖరీదైనా వస్తువుగా మారిపోయింది. మిగతా వస్తువులు ఏవైనా దుకాణాల్లో దొరుకుతాయి. కానీ ఇసుక దొరకదు కనుక ఆ వనరులు అవకాశం ఉన్న దగ్గర నుంచి సమకూర్చుకునేందుకు ఎన్నో అడ్డంకులు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందడంలో ఇండ్లు, రోడ్ల నిర్మాణాలకు ఇసుక ప్రధాన వనరు. సహజ వనరుల్లో ఒకటైన ఇసుక కొందరి స్వార్థపరుల అక్రమార్జానలో బందీ అయిపోయింది.
అందులో భాగంగానే ప్రభుత్వం కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఇసుక అవసరం ఉన్నవారు ప్రభుత్వ రెవెన్యూ అధికారుల అనుమతులను తీసుకుని ఉపయోగించుకోవాలని సూచించినప్పటికీ అక్రమార్కులు అక్రమ సంపాదన కోసం ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టాలని దొంగచాటుగా అక్రమ రవాణా కొనసాగించడంతో ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా, చాలానాలు రాసినా ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. వినియోగదారుడి అవసరంతో ఇసుకకు భారీగా డిమాండ్ పెరిగిపోతుందని పోలీసులు తెలుపుతున్నారు.
నిబంధనలు తీసుకురావాలి..
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని ఇసుక పరీవాహక ప్రాంతాలైన జాజిరెడ్డిగూడెం, వర్ధమానుకోట, పేరబోయినగూడెం, అనంతారం, తాటిపాముల, నందాపురం, చిర్ర గూడూరు, జానకిపురం, కోటమర్తి, ధర్మారం, లక్ష్మీదేవి కాల్వ, అజింపేట, వెల్దేవి, మానాయికుంట గ్రామాల పరిసరాల పరిధిలో మూసీ వాగు, బిక్కేరు వాగు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో పుష్కలంగా ఇసుక వనరులు లభిస్తున్నాయి. దీంతో ట్రాక్టర్ల యజమానులు అక్రమార్జనే ధ్యేయంగా రాత్రి సమయాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా దందా సాగిస్తున్నారు. దీంతో సక్రమంగా అన్ని అనుమతులతో ఇంటి నిర్మాణం చేసుకునే వారికి మాత్రం ఇసుక భారమై పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇసుక పాలసీపై షరతులతో కూడిన నిబంధనలు తీసుకొచ్చి సామాన్యుడికి సైతం ఇల్లు కట్టుకోవడానికి ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నారు.
ఎడ్ల బండ్లతో ఇసుక రవాణా..
ఇసుక రవాణాకు ట్రాక్టర్లను నిషేధించడంతో రవాణాకు అనుమతులు ఇవ్వకపోవడంతో కొన్నిచోట్ల ఎడ్లబండ్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్నారు. తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం గ్రామ రైతులు ఎడ్లబండ్ల ద్వారా ఇసుక రవాణాను జోరుగా కొనసాగిస్తున్నారు. ఎడ్లబండ్లు జాతరను తలపించేలా ఇసుక రవాణా సాగిస్తున్నారు. ఒక వైపు ఏరు నీటితో ప్రవహిస్తున్నప్పటికీ ఆ నీటి నుంచే నీరు కారుతున్న ఇసుకను బండ్లల్లో తీసుకొస్తూ నోరులేని మూగజీవాలను కాసుల కోసం కక్కుర్తి పడుతూ మోయలేని భారం తో జంతువులను హింసిస్తూ ఇసుక రవాణా సాగిస్తున్నారు. గతంలో సీజ్ చేసిన ఇసుక డంపులను సైతం రాత్రికి రాత్రే జేసీబీలు పెట్టి మాయం చేస్తున్నారు. అభివృద్ధిలో భాగంగా నూతన ఇండ్ల నిర్మాణాలకు, సీసీ రోడ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక అనుమతులకు ప్రభుత్వం నిబంధనలు ప్రకటించాలని పలువురు కోరుతున్నారు.
ఉపాధిని కోల్పోతున్న కార్మికులు
ఇండ్ల నిర్మాణాలను చేస్తూ జీవనం సాగించుకునే తాపీ కార్మికులు ఇండ్ల నిర్మాణాలు చేపట్టే వారికి సకాలంలో ఇసుక అందకపోవడంతో జీవనోపాధి కోల్పోతున్నారు. ఇసుక అందే వరకు పని లేకుండా ఇంటి వద్ద ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుందని తాపీ మేస్త్రీలు, పార కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ప్రధాన సమస్యగా ఏర్పడి తమ జీవనోపాధిని కోల్పోతున్నామని, ఇసుక అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.