MLA Beerla Ailaiah : ఆలయంలో అవినీతి అధికారులు, ఉద్యోగులను ఉపేక్షించేది లేదు..

యాదాద్రి ఆలయంలో అవినీతి అధికారులు, ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు.

Update: 2024-08-03 12:21 GMT

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి ఆలయంలో అవినీతి అధికారులు, ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య స్పష్టం చేశారు. శనివారం బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, రాజపేట మండలాల లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను యాదగిరిగుట్టలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 1800కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధి జరిగిన స్థానికులు ఎవరు సంతోషంగా లేదన్నారు. యాదాద్రి అభివృద్ధి పేరు మీద భూములు గుంజుకున్నారని, వారికి ఇప్పటికే పారితోషికం ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల కోసం మాట్లాడితే యాదాద్రి ఆలయం కోసం మాట్లాడినట్టు మాటలను వక్రీకరించి బీజేపీ నాయకులు చేసిన ధర్నాను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నడూ యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం మాట్లాడని నాయకులు ఇప్పుడు మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. యాదాద్రిలో నూతనంగా 1000 గదులతో సత్రం నిర్మాణం చేయాలని సంబంధింత మంత్రిని కోరినట్లు చెప్పారు. యాదాద్రి ఆలయంలో అవినీతి అధికారులు, ఉద్యోగులను ఉపేక్షించేది లేదన్నారు.

నిరంతరం ప్రజల్లో ఉంటూ, అభివృద్ధి, సేవలు చేస్తుంటే నిరాదరణ లేని ఆరోపణలు మంచిది కాదన్నారు. మొదటి తిరుపతిగా అభివృద్ధి చెందుతున్న యాదగిరిగుట్ట ఆలయానికి అందరూ సహకరించాలని కోరారు. తొమ్మిది రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అన్ని శాఖల పద్దుల పై పూర్తిస్థాయిలో చర్చలు కొనసాగాయన్నారు. ఆలేరు నియోజకవర్గం తాగు, సాగు నీరు అందలేదని, అదే విధంగా నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. నవాబ్ పేట రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గానికి నీరు అందించాలని ప్రతిపాదన చేశామన్నారు. బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం నియోజకవర్గలోని పలు తాండలు, గ్రామాల భూములు కోల్పోయారని, ఇంకా కూడా బాధితులకు నష్టపరిహారం అందలేదని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. గంధమల్ల చెరువు అభివృద్ధి చేసి పెద్దగా చేస్తే 10 మండలాల వరకు సస్యశ్యామలం అవుతుందన్నారు. గంధమల్ల ప్రాజెక్టును 1.3 టీఎంసీ, 2 టీఎంసీల వరకు ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. అదే విధంగా పలు ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీళ్లు అందించడం కోసం కూడా చర్యలు చేపట్టాలన్నారు.

Tags:    

Similar News