మా బిల్డింగ్.. మా ఇష్టం..!!

ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఆక్రమణదారులు యథేచ్చగా కబ్జా చేస్తున్నారు.

Update: 2024-12-21 04:06 GMT

దిశ, సూర్యాపేట టౌన్ : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఆక్రమణదారులు యథేచ్చగా కబ్జా చేస్తున్నారు. సూర్యాపేట పట్టణంలోని చెరువులు, కుంటలతో పాటు వరద కాల్వలు కనుమరుగవుతున్నాయి. ఒక చెరువు నుంచి మరో చెరువుకు అనుసంధానంగా ఉన్న నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. కాల్వలపైనే బహుళ అంతస్తులను నిర్మిస్తున్నారు. గతంలో విశాలంగా ఉన్న నాలాలు నేడు కుచించుకుపోయి మురికికాలువలను తలపిస్తున్నాయి. సూర్యాపేటలోని కుడ కుడ రోడ్ లో ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఏకంగా రోడ్డును కబ్జా చేసి అనుమతులు లేకుండా సెల్లార్ నిర్మించి, ప్రస్తుతానికి దానికి తాత్కాలిక గోడ ఏర్పాటు చేసుకొని బహుళ అంతస్తు నిర్మించాడు. ఈ విషయం తెలిసినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది.

అలాగే జిల్లా కేంద్రంలో ఎన్ హెచ్ 65 పక్కన 60 ఫీట్ రోడ్డు పక్కన నాలాను ఆక్రమించి గోడ నిర్మించాడు మరో వ్యక్తి. సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు, నాలాల మీద గోడలు, అలాగే కొంతమంది రోడ్లు, చెరువులు కబ్జా చేసి పూడ్చి భవనం నిర్మిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇంకొంతమంది మున్సిపాలిటీ పరిధిలో ఇష్టారాజ్యంగా రేకుల షెడ్లు వేస్తూ సంబంధిత అధికారులకు చేతులు తడుపుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇంకొంతమంది నోటీసులు అందినా పట్టించుకోవడం లేదు. వరద కాలువను ఆక్రమించి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతుంటే పట్టించుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మౌనం పాటిస్తున్నారు.

మారని అధికారుల తీరు..

ఓవైపు ఆరోపణలు, మరోవైపు విమర్శలు, అయినా సూర్యాపేట మున్సిపల్ అధికారుల తీరుమారడం లేదు. అధికారుల పనితీరుపై విమర్శలు గుప్పుమంటున్నా లైట్ తీసుకుంటున్నారు. అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ ఇల్లీగల్ నిర్మాణాలను వదిలేస్తూ జేబులు నింపేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల అడుగు గుజాడల్లోనే కిందిస్థాయి సిబ్బంది నడుస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బంది చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న తీరుతో అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా బహుళ అంతస్తు భవనాలు కొనసాగుతున్నాయి. దీంతో సూర్యాపేట మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.

డివిజన్ వ్యాప్తంగా అక్రమ భవన నిర్మాణాలు..

సూర్యాపేట డివిజన్ వ్యాప్తంగా భవన నిర్మాణాలు జోరందుకున్నాయి. ఇన్నాళ్లు ఏదో ఒక కారణంతో ఆగిన నిర్మాణాలు సైతం ఇప్పుడు ఎంచక్కా పూర్తవుతున్నాయి. పర్మిషన్లు ఉన్నాయా..? లేదా..? అసలు అనుమతి కోసం సంబంధిత శాఖలలో అప్లై చేసుకున్నారా..? అనే ప్రశ్నలకే తావులేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆవైపు సంబంధిత సిబ్బంది వెళ్లినా చూసీ చూడనట్టుగా వ్యవహరించడం, అక్రమార్కులకు వత్తాసు పలుకుతుండడంతో ఈ తరహా నిర్మాణాలకు మరింతగా ఊతమిస్తున్నట్లుగా తయారయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట డివిజన్ లో అనేక నిర్మాణాలు సాగుతున్నా పర్మిషన్లు మాత్రం కొన్నింటికే ఉన్నాయని తెలుస్తోంది. అయినా సంబంధిత సిబ్బంది మాత్రం ఉలుకు పలుకు లేకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అనుమతులు లేని నిర్మాణాల వల్ల సంబంధిత శాఖల ఆదాయానికి భారీ గండి పడుతుందని తెలిసినా ఏ లాభాపేక్ష కోసం అధికారులు అక్రమార్కులకు వంత పాడుతున్నారో వారికే తెలియాలి. ఇలాంటి నిర్మాణాల వద్ద కిందిస్థాయి సిబ్బంది గట్టిగానే చేతులు తడుపుకుంటున్నారన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. సూర్యాపేట పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ కట్టడాలపై, కోర్టు కేసుల్లో ఉన్న స్థలాలకు అనుమతులు ఇవ్వడం పై భారీగా చేతులు మారినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ కట్టడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయంపై మాట్లాడేందుకు దిశ ప్రతినిధి ప్రయత్నించగా కమిషనర్ ఫోన్ ఎత్తడం లేదు.


Similar News